వరంగల్ మున్సిపాలిటీలలో విజేతలెవరో..12 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు

వరంగల్ మున్సిపాలిటీలలో విజేతలెవరో..12 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్​ 
  • సగటున 50 నుంచి 150 మంది కౌంటింగ్​ సిబ్బంది
  • ఒక్కో సెంటర్​ పరిధిలో 200 నుంచి 400 పోలీసుల బందోబస్తు

వరంగల్‍, వెలుగు: మరికొన్ని గంటల్లో ఓరుగల్లులో మున్సిపాలిటీల విజేతలెవరో తేలనుంది. బుధవారం నిర్వహించిన పోలింగ్​లో ఉమ్మడి జిల్లాలో 80.64 శాతం ఓటింగ్​ నమోదైంది. ఈ క్రమంలో స్ట్రాంగ్‍ రూముల్లో ఉన్న బ్యాలెట్‍ ఉదయం 8 గంటల నుంచి తెరిచి ఓట్లను లెక్కించేందుకు అధికారులు సమయాత్తమయ్యారు. 

మున్సిపాలిటీల్లోని వార్డులు, ఓట్ల సంఖ్య ఆధారంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్త్ ఏర్పాటు చేశారు. పార్టీ అభ్యర్థుల తరఫున కౌంటింగ్‍ ప్రక్రియ పరిశీలనకు వచ్చేవారికి ఐడీ కార్డులు జారీ చేశారు. ఫలితాల అనంతరం పోలీసుల పర్మిషన్‍ లేకుండా విజయోత్సవాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. 

సగటున 3 వార్డులకు 1 టేబుల్‍..

ఓట్ల లెక్కింపులో భాగంగా అధికారులు ప్రతి 3, 4 వార్డులకు ఓ టేబుల్‍చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. నర్సంపేటలో 30 వార్డులు ఉండగా, 10 టేబుళ్లు, వర్ధన్నపేటలో 12 వార్డులకు 3 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 తక్కువ వార్డులుండే సెంటర్‍లో 50 నుంచి 60 మంది ఆర్వోలు, ఏఆర్వోలు, కౌంటింగ్​ సూపర్‍వైజర్లు, అసిస్టెంట్‍ కౌంటింగ్​ సూపర్‍వైజర్లు ఉండగా, 30 వార్డులుండే పెద్ద సెంటర్లలో దాదాపు 150 మంది సిబ్బంది ఉండనున్నారు. పోలీస్​ బందోబస్తు కోసం 200 మంది నుంచి 400 మంది వరకు పని చేయనున్నారు. 

ఇండిపెండెంట్లపై పార్టీ నేతల ఫోకస్‍..

వరంగల్​ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా, వర్ధన్నపేట, తొర్రూర్‍, జనగామ వంటి 6 నుంచి 7 సెంటర్లలో అధికార కాంగ్రెస్‍, బీఆర్‍ఎస్​ అభ్యర్థుల మధ్య టఫ్​ పోటీ నెలకొన్నది. మున్సిపాలిటీ పీఠం దక్కించుకోవాలంటే ఎక్స్​ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి.

 వీటినిదాటి సభ్యుల సహకారం అవసరంపడే నేపథ్యంలో కాంగ్రెస్‍, బీఆర్‍ఎస్​ పెద్దలు విజయం సాధించే ఇండిపెండెంట్లు, రెబల్​ క్యాండిడేట్లపై ఫోకస్ పెట్టారు. విజయం సాధించే అవకాశం ఉన్నా ఇతర పార్టీల క్యాండిడేట్లను క్యాంపులకు తరలించేలా ప్రధాన పార్టీల బడా నేతలు ప్లాన్​ చేశారని ప్రచారం జరుగుతోంది. 

ఏర్పాట్ల పరిశీలన..

జయశంకర్​ భూపాలపల్లి/ వర్ధన్నపేట/  జనగామ అర్బన్ : మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు అధికారులు అంతా సిద్ధం చేశారు. గురువారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డా.బీ.ఆర్​ అంబేద్కర్​ క్రీడా ప్రాంగణంలోని మినీ ఫంక్షన్​హాల్​లో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్​ రాహుల్​ శర్మ పరిశీలించారు. 

అంతకుముందు నిర్వహించిన ప్రత్యేక శిక్షణలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. వర్ధన్నపేట మున్సిపల్​ కమిషనర్​కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్​ కేంద్రాన్ని కలెక్టర్​ సత్యశారద పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. జనగామ పట్టణంలోని ఏకశిలా బిఎడ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లను అడిషనల్​ కలెక్టర్ పింకేశ్​ కుమార్ పరిశీలించారు.

మున్సిపాలీల వారీగా కౌంటింగ్​ సెంటర్ల వివరాలు

1.నర్సంపేట : మార్కెట్ యార్డు, ద్వారకపేట రోడ్, నర్పంపేట
2.వర్ధన్నపేట : స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్‍
3.పరకాల : గణపతి కాలేజీ 
4.భూపాలపల్లి : అంబేడ్కర్​ క్రీడా మైదానం మినీ ఫంక్షన్‍హాల్‍
5.ములుగు : ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
6.జనగామ : ఏకశిలా బిఎడ్ కాలేజీ
7.స్టేషన్‍ఘనపూర్‍ : సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​స్కూల్, కాలేజ్​​
8.తొర్రూర్‍ :  ఆర్యభట్ట స్కూల్‍
9.మరిపెడ : సేయింట్‍ఆగస్టీస్‍హై స్కూల్‍
10.కేసముద్రం : ఏఎంసీ, కేసముద్రం
11.డోర్నకల్‍: నిర్మల హై స్కూల్‍
12.మహబూబాబాద్‍ : సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‍