
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ పనులు ప్రారంభించాలని టీజేఎస్‌అధ్యక్షుడు ప్రొ.కోదండరాం కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణంలో తామంతా భాగస్వాయులు అవుతామని చెప్పారు. ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా హాస్పిటల్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ విషయాన్ని తాను సీఎం రేవంత్దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మంగళవారం ఉస్మానియా హాస్పిటల్లో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొ.కోదండరాంతోపాటు మాజీ ఎంపీ అజీజ్ పాషా, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, పత్రిక సంపాదకులు అమీర్ అలీ ఖాన్, ఓఎంసీ అల్యూమినియం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్.కృష్ణారెడ్డి, డాక్టర్ ఎస్.కృష్ణమూర్తి, డాక్టర్ బొంగు రమేశ్, ఉస్మానియా హాస్పిటల్ వివిధ విభాగాల హెచ్ఓడీలు, నర్సుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్కోసం రూ.200 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించి, తర్వాత పట్టించుకోలేదన్నారు. పాత బిల్డింగ్‌ను మూసివేయడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందాలంటే కొత్త బిల్డింగ్‌ను కచ్చితంగా నిర్మించాల్సిందేనని స్పష్టం చేశారు.
అయితే పాత భవనం కూల్చివేస్తారా? చంచల్ గూడ ప్రింటింగ్ ప్రెస్ ఖాళీ స్థలంలో లేదా గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్మిస్తారా? అనేది ప్రభుత్వ ఇష్టమని చెప్పారు. మాజీ ఎంపీఅజీజ్ పాషా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హాస్పిటల్బిల్డింగ్పనులను ప్రారంభించాలని కోరారు. డాక్టర్ బొంగు రమేశ్ మాట్లాడుతూ.. కోదండరాం నాయకత్వంలో బిల్డింగ్నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బిల్డింగ్నిర్మాణంపై అభిప్రాయాలను సేకరించారు.