ఉస్మానియా కొత్త బిల్డింగ్​ ఇంకెప్పుడు?

ఉస్మానియా  కొత్త బిల్డింగ్​ ఇంకెప్పుడు?
  •  భవన నిర్మాణాన్ని పట్టించుకోని సర్కార్ 
  •  పాత బిల్డింగ్​ ఖాళీతో పేషెంట్లకు ఇబ్బందులు
  •  డాక్టర్లకు సరిపడాలేని సర్జరీ రూములు
  • సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఆరేండ్లు పూర్తి

హైదరాబాద్​, వెలుగు: వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖానకు కొత్త బిల్డింగ్​ఎప్పుడు కడతరో క్లారిటీ లేదు. దీనిని ప్రభుత్వం పూర్తిగా పక్కన  పడేసింది. పాత బిల్డింగ్​కు పెచ్చులూడుతుండడం, వర్షాలు పడితే వార్డుల్లోకి నీరు వస్తుండడంతో ఏడాదిన్నర కిందట వైద్యసేవలు నిలిపేశారు. ఇప్పుడున్న దవాఖాన చాలకపోతుండగా పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిరోజు 1500 నుంచి 2 వేల వరకు ఔట్​పేషెంట్లు వస్తుంటారు. దవాఖానలో ఎప్పుడూ ఇన్​పేషెంట్లుగా వెయ్యి మంది దాకా ఉంటుంటారు.  ఆపరేషన్లు చేసిన తర్వాత పేషెంట్లను ఉంచేందుకు పోస్ట్​ ఆపరేటివ్​వార్డులు కూడా సరిపడా లేవు.  దీంతో సర్జరీలు  చేసిన తర్వాత రెండు, మూడు రోజుల్లోనే పేషెంట్లను ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. చివరకు బల్దియా షెల్టర్ హోమ్ ని కూడా ఆపరేషన్ల కోసం వినియోగిస్తున్నారు. కొత్త బిల్డింగ్ నిర్మాణంపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పేషెంట్లు మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇప్పటికే డాక్టర్లు కొత్త బిల్డింగ్​నిర్మించాలని ఎన్నోసార్లు ఆందోళనలు కూడా చేశారు. 
ప్రత్యామ్నాయంగా కట్టాలని.. 
ట్విన్​ టవర్స్​ కడతామని సీఎం హామీ ఇచ్చినా, ఆ తర్వాత కోర్టు కేసుతో పేరుతో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎవరూ మాట్లాడడంలేదు. ఎం ఐఎం నేతలు కూడా బిల్డింగ్​కూల్చివేతపై నిర్ణయం తెలిపారు. అయితే ఏ సందర్భం వచ్చిన కూడా ఉస్మానియా బిల్డింగ్​పైనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ లో మొదలుకొని, అభివృద్ధి పనుల్లోను దీనిపైనే మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో కూడా కొందరు నేతలు కొత్త దవాఖాన నిర్మించాలని, మరికొందరు వేరే చోట కట్టాలని సూచిస్తున్నారు. పాత బిల్డింగ్​ కూల్చి వేయొద్దని,  కట్టడాలను పరిరక్షించే కార్యకర్తలు, ఉస్మానియా ఓల్డ్​డాక్టర్లు డిమాండ్ చేసి కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించారు. హెరిటేజ్ బిల్డింగ్​కాపాడాలంటూ కోర్టుకు వెళ్లిన వారితో చర్చించడమో, కోర్టులో తుది తీర్పు వరకు పోరాడటమో చేయకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటుంది. 
నాటి నుంచి అంతే..
2010 లో ఉమ్మడి ఏపీ సీఎం రోశయ్య ఉస్మానియా దవాఖాన బిల్డింగ్​ల మరమ్మతులకు రూ.200 కోట్ల ఇవ్వగా, అదే ఏడాది నవంబర్ 11న జీవో కూడా విడుదలైంది. హెరిటేజ్​బిల్డింగ్​కి రిపేర్లు చేసి మిగిలిన బిల్డింగ్​లను కూలగొట్టి వాటి స్థానంలో కొత్తగా కట్టాలని అప్పట్లోనే నిర్ణయించారు.  3 ఏళ్లలోనే  12 లక్షల ఎస్ఎఫ్టీ ఏరియాలో కొత్త బిల్డింగ్​లు కట్టాలని  ప్రతిపాదించి, ఓ కన్సల్టెన్సీ సంస్థకు కూడా పనులు అప్పగించారు. ఆ తర్వాత పనుల పర్యవేక్షణకు డాక్టర్లు, ఓల్డ్​ స్టూడెంట్స్ తో  కమిటీలు కూడా వేశారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉస్మానియా దవాఖానను కూల్చేసి  ట్విన్​టవర్స్​నిర్మిస్తామని సీఎం కేసీఆర్​నిర్ణయించారు. ఎమ్మెల్యేలతో కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. కేసీఆర్ ఉస్మానియాను సందర్శించి ఆరేళ్లు దాటినా ఇప్పటి వరకు  ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. హెరిటేజ్ భవనాలను మినహాయించి మిగతా 5 ఎకరాల స్థలంలో అధునాతన ట్విన్ టవర్స్ నిర్మించేందుకు సర్కార్​ ప్లాన్​ సిద్ధం చేసినా దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు.