ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు ఉక్కిరిబిక్కిరి.. డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు

ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు ఉక్కిరిబిక్కిరి.. డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు

హైదరాబాద్/పద్మారావు నగర్, వెలుగు : ఉస్మానియా హాస్పిటల్ పేషెంట్లతో సోమవారం కిక్కిరిసిపోయింది. సరైన సౌలత్​లు లేకపోవడంతో రోగులు, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరల్ వార్డుల్లో పరిస్థితి చేపల మార్కెట్​ను తలపిస్తున్నదని అక్కడ పనిచేసే డాక్టర్లే సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో పరిస్థితిని తెలిపేందుకు వాళ్లు పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పేషెంట్‌‌‌‌తో కనీసం రెండు నిమిషాలు మాట్లాడే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. వార్డులో ఉండలేకపోతున్నామని, టాయిలెట్లు కంపు కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియాలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా సర్కార్‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పేషెంట్లకు ఇన్ఫెక్షన్లు సోకి, వారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

పేషెంట్లతో గాంధీ కిటకిట

వానాకాలం ప్రారంభం కావడంతో సోమవారం గాంధీ హాస్పిటల్ ఔట్ పేషెంట్లతో నిండిపోయింది. సిటీ నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి వచ్చిన రోగులు ఓపీ స్లిప్స్ కోసం గంటల తరబడి క్యూలైన్​లో నిల్చున్నారు. కొందరు ట్రీట్​మెంట్ తీసుకుని వెళ్లిపోగా.. మరికొందరు ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్​కు 4వేల మంది రోగులు రాగా, వారిలో 1,500 మంది కొత్త పేషెంట్లు ఉన్నారు. మిగిలిన 2,500 మంది ఇంతకుముందు ట్రీట్​మెంట్ తీసుకుంటున్నవారు. ఒక్కసారిగా హాస్పిటల్ రోగులతో కిక్కిరిసిపోవడంతో డాక్టర్లు పలు సూచనలు చేశారు. వర్షాకాలం కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏ పూటకు ఆ పూట వంట చేసుకుని తినాలని, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

ALSO READ:పోడు పట్టాలు ఇంకెప్పుడు? రాష్ట్ర సర్కార్‌‌‌‌కు కాంగ్రెస్ నేత రాములు నాయక్ ప్రశ్న

ఒకే వార్డులో 80కి పైగా బెడ్లు

వరదలు రావడం, బిల్డింగ్ కూలిపోయే దశకు చేరడంతో ప్రభుత్వ సూచన మేరకు రెండేండ్ల కిందే ఉస్మానియా పాత బిల్డింగ్​ను అధికారులు పూర్తిగా మూసేశారు. అందులో ఉన్న వార్డులను మిగిలిన బిల్డింగుల్లోని వార్డుల్లో, హాళ్లలో సర్దుబాటు చేశారు. పేషెంట్లకు ఏ మాత్రం ప్రైవసీ లేకుండా ఒకే వార్డులో సుమారు 80 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇన్‌‌‌‌ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బెడ్లు అన్నీ నిండిపోయాయి. కొంత మందిని కిందే పడుకోబెట్టి ట్రీట్‌‌‌‌మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేషెంట్లు, వారి అటెండెంట్లు, విజిటర్స్, డాక్టర్లు, నర్సులతో వార్డులన్నీ కిక్కిరిసిపోతున్నాయి.