బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ సతీష్ కుమార్

బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ సతీష్ కుమార్
  • కొనసాగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన
  • కేసీఆర్ లేదా కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ కావాలని డిమాండ్
  • వీసీ వల్లనే ఏం కాలేదు... డైరెక్టర్ ఏం చేస్తారంటున్న విద్యార్థులు

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సతీష్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ సమస్యలు  పరిష్కరించాలంటూ విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. 12 డిమాండ్లతో విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. విద్యార్థులు గేటు వైపు దూసుకురాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారికి తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో నీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా నియమించింది. డైరెక్టర్ నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వీసీ వల్లనే ఏం కాలేదు... డైరెక్టర్ ఏం చేస్తారంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని వెల్లడించారు. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ వస్తే తప్ప తమ ఆందోళనను విరమించేదిలేదని విద్యార్థుల తేల్చి చెప్పారు.