ఓయూ హాస్టల్ విద్యార్థుల వెతలు..

ఓయూ హాస్టల్ విద్యార్థుల వెతలు..

చరిత్ర ఘనం.. పరిస్థితి అధ్వానం అన్నట్లుగా తయారైంది ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి. శిథిలమైన బిల్డింగులు, పెచ్చులూడుతున్న పై కప్పులు, కంపు కొడుతున్న హాస్టళ్లు. ఉడికీ ఉడకని తిండి... ఇలా ఓయూ విద్యార్థులు పడుతున్న తిప్పలు ఒకటీ రెండూ కాదు. 

దశాబ్దాల క్రితం నిర్మించిన పురాతన భవనాల్లో ఓయూ హాస్టళ్లు కొనసాగుతున్నాయి.వాటిలో చాలా వరకు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. సీ హాస్టల్ మెస్ డైనింగ్ హాల్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో పై పెచ్చులు ఊడి పడ్డ సందర్భాలు ఉన్నాయి. బిల్డింగ్పై నిల్వ ఉన్న వర్షపు నీరు ఉరుస్తుండంతో బురదమయంగా మారింది. హాస్టల్ కిచెన్లు చెత్తా చెదారంతో నిండిపోయినా పట్టించుకునే నాథుడే లేదు. వైరింగ్ పాతది కావడంతో కరెంట్ వైర్లన్నీ గోడలకు వేలాడుతున్నాయి. ఇక ఏ గోడను ముట్టుకున్నా పెచ్చులు పెచ్చులుగా ఊడి వస్తున్నాయి. 

సీ హాస్టల్ మెస్ లో సీటింగ్ కెపాసిటీ విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా లేదు. ప్యూరిఫైయర్ నుంచి వచ్చే నీటిని స్టోర్ చేసే ట్యాంకుల పైన దుమ్ము పట్టి పోయాయి. ట్యాంకుల లోపల సైతం మట్టి పేరుకుపోయింది. గత్యంతరంలేని పరిస్థితుల్లో విద్యార్థులు అవే నీటిని తాగుతున్నారు. ఇక ఫుడ్ విషయానికొస్తే ఉడికీ ఉడకని అన్నం, రుచీపచీ లేని కూరలతోనే సరిపెట్టుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. ఏ అధికారికి ఫిర్యాదు చేసినా.. చేస్తాం చూస్తాం అంటున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వంట చేసే  మనుషులు సైతం అవసరానికి తగ్గట్లు లేని వర్కర్లు అంటున్నారు. తక్కువ జీతాలు ఇస్తుండటంతో పని చేసేందుకు ఎవరూ రావడం లేదని చెబుతున్నారు.