టైమ్స్ బెస్ట్ విద్యా కేంద్రంగా ఉస్మానియా

టైమ్స్ బెస్ట్ విద్యా కేంద్రంగా ఉస్మానియా

హైదరాబాద్: విద్యా రంగంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన ఉస్మానియా యూనివర్శిటీకి మరో గుర్తింపు లభించింది. 2022 విద్యాసంవత్సరానికి గాను దేశంలో అత్యుత్తమ విద్యా కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీని గుర్తిస్తూ “ది ఎకానామిక్ టైమ్స్” అవార్డు ప్రకటించింది. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసిన టైమ్స్ గ్రూప్ పలు విద్యా సంస్థలకు అవార్డులు ప్రకటించాయి. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అస్సాం విద్యాశాఖ మంత్రి   డాక్టర్ రనోజ్ పెగు చేతుల మీదుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ తరపున యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ జి మల్లేశం అవార్డు అందుకున్నారు. ప్రఖ్యాత గ్రూప్ ప్రకటించిన అవార్డు ఉస్మానియా తరఫున అందుకోవటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రొఫెసర్ మల్లేశం ఆనందం వ్యక్తం చేశారు.

ఉస్మానియా ఖ్యాతిని ఇనుమడింపజేసేలా అత్యుత్తమ విద్యాకేంద్రంగా టైమ్స్ అవార్డు దక్కడం ఆనందంగా ఉందని ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ.రవిందర్ అన్నారు. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు.  అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల కృషి  వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు ధీటుగా ఉస్మానియాను రిఫార్మ్ చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇందుకోసం యూనివర్సిటీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి అవార్డుల ద్వారా తాము చేపడుతున్న సంస్కరణలు, పరిశోధనలకు మరింత ఊతమిస్తాయని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. రాబోయే రోజుల్లో ఓయూను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని  ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్ తెలిపారు.