ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఓటీటీలు

ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఓటీటీలు
  • కరోనా దెబ్బకు మూతపడ్డ చాలా థియేటర్లు
  • ఎవరి ఫోన్లో చూసినా ఓటీటీ యాప్లే
  • స్మార్ట్ టీవీల్లో ఓటీటీలదే సందడి
  • ప్రత్యమ్నాయంగా మారిన ఓటీటీ ప్లాట్ఫాం
  • కొత్త కొత్త ఆఫర్లతో ఆకర్షిస్తున్న కంపెనీలు

ఒకప్పుడు కొత్త సినిమా రిలీజయిందంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడేవారు. పెద్ద హీరో సినిమా అయితే ఇక అంతే సంగతులు. టికెట్లు కూడా దొరికేవి కావు. థియేటర్ల ముందు ఫ్యాన్స్ కోలాహలం మామూలుగా ఉండేది కాదు. తమ అభిమాన హీరోల ప్లెక్సీలకు పూలదండలు, పాలాభిషేకాలు... అబ్బబ్బో ఆ సీనే వేరు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడంతా ఓటీటీ మాయ. మీ చేతిలో సెల్ఫోన్ లేదా ఇంట్లో టీవీ... అందులో ఆహా, డిస్నీ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ వంటి యాప్లు.. ఈ యాప్లు మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా కట్టిపడేస్తాయి. అందమైన సినీ ప్రపంచాన్ని మీ కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తాయి. మీ అభిమాన హీరో, హీరోయిన్లను మీ ముందు నిలబెట్టి డ్యూయెట్స్ చేపిస్తాయి. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ మూవీస్  దాకా అన్నీ ఇప్పుడు ఓటీటీలో వస్తున్నాయి. 

ఓటీటీలకు ఆదరణ పెరగడానికి కారణాలు ఏంటంటే...?

ఓటీటీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. దానికి గల ప్రధాన కారణాలు

కరోనా వల్ల ముందే వచ్చిన ఓటీటీ బూమ్....

2025–26 లో రావాల్సిన ఓటీటీ బూమ్ కరోనా వల్ల ముందే వచ్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. థియేటర్లు కూడా మూతపడటంతో ఎంటర్టైన్మెంట్ కు ఛాన్స్ లేకుండాపోయింది. నెలల పాటు ఇళ్లల్లో ఉండటానికి చాలా జనం చాలా ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు ఓటీటీల ఆఫర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తక్కువ ఖర్చుతో సబ్ స్క్రిప్షన్ ఇస్తూ కొత్త కొత్త సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేశాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీకి చాలా దగ్గరయ్యారు. తర్వాత ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేశాయి. దీంతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కానీ ఒకటో రెండో పెద్ద సినిమాలను తప్ప... మిగతా సినిమాలు చూడడానికి  ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు. ఎలాగూ ఏ సినిమా ఐనా ఓటీటీలో రిలీజ్ అవుతుంది... అప్పుడు చూద్దాంలే అన్నట్లు సగటు ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లడం తగ్గించేశాడు. ఈ క్రమంలోనే సినీ నిర్మాతలు తమ మూవీలను ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. ఇంకో ఐదారేళ్లల్లో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య మరింత తగ్గొచ్చని సినీ పండితులు చెబుతున్నారు.

టికెట్లు రేట్లు కూడా కారణమే....

ఇక ప్రేక్షకులు ఓటీటీకి జైకొట్టడానికి ఇంకో కారణం... టికెట్ రేట్లు. ఒక్కో సినిమాకు ఒక్కో రేటు విధిస్తూ సినిమా నిర్మాణ సంస్థలు సామాన్యులపై టికెట్ల భారం మోపుతున్నాయి. ఇవాళ ఓ ఫ్యామిలీ థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే... కనిష్టంగా 2000 దాకా ఖర్చవుతోంది. ఒక వేళ సినిమా బాగుండి మళ్లీ చూద్దామని అనుకుంటే... ఈ ఖర్చు తడిసి మోపెడవుతోంది. అదే ఓటీటీ లో ఐతే రూ.1000 తో ఏడాది మొత్తం ప్రేక్షకుడు తాను సబ్ స్క్రైబ్ చేసుకున్న ఓటీటీలో ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇంటర్ నెట్ ఖర్చు అవుతుంది. థియేటర్లో చూస్తే వచ్చే అనుభూతి ఓటీటీలో రాకపోయినప్పటికీ... జనాలు మాత్రం ఓటీటీ వైపే మొగ్గుతున్నారు. 

ఆకర్షిస్తున్న ఓటీటీ కంపెనీలు...

ఇక కొత్త కొత్త ఆఫర్లతో ఓటీటీ కంపెనీలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. వెబ్ సిరీసులు, కొత్త కొత్త సినిమాలురి లీజ్ చేస్తూ... థియేటర్లకు పోకుండా ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటున్నాయి. తక్కువ ధరకే ఏడాది సబ్ స్క్రిప్షన్ ఇస్తున్నాయి. మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీల్లో ఓటీటీ యాప్లు ఇన్స్టాల్ చేసుకుని ప్రేక్షకులు వినోదం పొందుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు యాప్ యజమాన్యాలు యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. కుకరీ షోస్, టాక్ షోస్, సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు, గేమ్స్, మూవీస్, సీరియల్స్ లాంటి రక రకాల వినోదాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి ఈ యాప్లు. డబ్బున్న వాళ్లు హోం థియేటర్స్, ప్రొజెక్టర్స్, పెద్ద టీవీలలో వీక్షిస్తూ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీల వల్ల  డబ్బు ఆదాతోపాటు సమయం కూడా కలిసివస్తోందని యూజర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, ఆహా, సోని లివ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు మార్కెట్లో దూసుకుపోతున్నాయి.  

ఓటీటీలతో సినిమా వాళ్లకు లాభమే...

కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా... రిలీజ్ కు ముందే పైరసీకి గురై నిర్మాతలు నష్టపోతున్నారు. ఓటీటీ వల్ల పైరసీ తగ్గినట్లేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిన్న నిర్మాతలకు ఓటీటీ పెద్ద దిక్కుగా మారింది. థియేటర్లలో సినిమా రిలీజ్ చేద్దామంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. దీంతో చిన్న నిర్మాతలు ఓటీటీకే జై కొడుతున్నారు. నటీనటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు.... ఇలా సినిమాకు చెందిన ప్రతి రంగంలోకి కొత్త కొత్త వాళ్లు ఓటీటీ ద్వారా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. పుష్ప లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన జగదీష్, క్యారెక్టర్ ఆర్టిస్టు శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఓటీటీ సిరీస్ ల నుండి వచ్చిన వారే. ఇక పోతే స్టార్ హీరోలు, నిర్మాతలు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు కూడా సొంత ఓటీటీ సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక తెలుగులో యూవీ క్రియేషన్స్, దిల్ రాజ్, అల్లు అరవింద్ వంటి వాళ్లు ఓటీటీల్లోనూ బిజీగా మారారు. 

మార్కెట్ లో ఓటీటీల హవా....

ప్రస్తుతం ఓటీటీ రంగం దూసుకుపోతుంది. కార్పోరేట్ స్థాయిలో దీనికి భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సంస్థకు దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఫ్యూచర్లో దీని బిజినెస్ పెద్ద స్కేల్ లో ఉండబోతుంది. దాదాపు అందరూ పెద్ద స్టార్స్ ఓటీటీలల్లోనటిస్తున్నారు. భారీ బడ్జెట్ లతో వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలింస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికన్నా రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉందని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 బిజినెస్ హెడ్ నిమ్మకాయల ప్రసాద్ చెబుతున్నారు. ఇప్పటికే థియేటర్లను ఓవర్ టేక్ చేసిన ఓటీటీలు... వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్నాయి. ఇక జనాలు కూడా సెలక్టివ్ గా సినిమాలు చూస్తున్నారు. భారీ సినిమాలు తప్ప మీడియం రేంజ్ సినిమాలను థియేటర్లలో చూడటం లేదు. ఓటీటీలు మంచి క్వాలిటీ ఇస్తుండటంతో ప్రేక్షకులు తక్కువ ధరకే మంచి ఔట్ ఫుట్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఓటీటీలతో నష్ట పోతుందెవరంటే....?

ఇక ఓటీటీల రాకతో చాలా మంది కార్మికులకు ఉపాధిలేకుండా పోతోంది. ముఖ్యంగా థియేటర్ల ఓనర్లతో పాటు అందులో పని చేసే కార్మికులు ఓటీటీ వల్ల ప్రధానంగా నష్టపోతున్నారు. థియేటర్లలో ఉండే పార్కింగ్, షాపింగ్, గేమింగ్ వంటి వాటికి ఓటీటీ వల్ల దెబ్బ పడింది. ఇంటి దగ్గరే ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి రావడంతో ట్రాన్స్ పోర్టు సంస్థలకు కూడా నష్టం వాటిల్లుతోంది. 

ఏదీ ఏమైనప్పటికీ ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. ఓటీటీల కోసమే కంటెంట్ రెడీ చేసే పరిస్థితి వచ్చింది. మార్పు మన మంచికే అన్నట్లు సగటు ప్రేక్షకుడు మాత్రం ఓటీటీకే జై కొడుతున్నాడు.