బాధపెట్టి ఉంటే క్షమించు.. చిరంజీవికి క్షమాపణ చెప్పిన RGV.. ఇంతకీ ఏమైందంటే..

బాధపెట్టి ఉంటే క్షమించు.. చిరంజీవికి క్షమాపణ చెప్పిన RGV.. ఇంతకీ ఏమైందంటే..

నాగార్జున ‘శివ’ సినిమాతో టాలీవుడ్లో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రాం గోపాల్ వర్మ లైఫ్ స్టైల్ రొటీన్కు భిన్నంగా ఉంటుంది. ఆయన తీసిన సినిమాలే కాదు.. నిజ జీవితంలో ఆయన చేసే వ్యాఖ్యలు, ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు వివాదాలకు తెరలేపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో మెగా ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపిన రాంగోపాల్ వర్మ.. మెగాస్టార్ చిరంజీవికి తాజాగా క్షమాపణలు చెప్పారు. ‘‘నేను మిమ్మల్ని బాధపెట్టి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను.. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు’’ అని చిరంజీవిని ఉద్దేశించి రాంగోపాల్ వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘శివ’ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్లో భాగంగా.. మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా గురించి మాత్రమే కాదు.. దర్శకుడు రాం గోపాల్ వర్మపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

‘శివ’ సినిమా ప్రస్తావన వస్తే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రాంగోపాల్ వర్మ అని చిరంజీవి గుర్తుచేశారు. ఆ కెమెరా యాంగిల్స్, లైటింగ్, సౌండ్ ప్రొజెక్షన్.. ప్రెజెంటేషన్.. అన్నీ అద్భుతంగా, కొత్తగా అనిపించాయని.. Wow అనిపించాయని ఆర్జీవీని చిరంజీవి పొగిడారు. ఆ రోజే తనకు అనిపించిందని.. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్ అని.. హ్యాట్సాఫ్ టూ రాం గోపాల్ వర్మ.. మొత్తం ‘శివ’ టీంకు తన హృదయపూర్వక శుభాకాంక్షలను చిరంజీవి తెలియజేశారు. ఈ వీడియోపై రాంగోపాల్ వర్మ స్పందించారు. గతంలో తాను మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాతాపం చెందారో.. ఏంటో తెలియదు గానీ చిరంజీవిని క్షమాపణ కోరాడు.

►ALSO READ | వేధించింది అబ్బాయి కాదు అమ్మాయి.. అనుపమ ఫొటోను మార్ఫింగ్ చేసి.. ఈ Gen-Z అమ్మాయి ఇలా చేసిందేంటి..?

చిరంజీవి, రాంగోపాల్ వర్మ సినిమా మధ్య ఒకప్పుడు సన్నిహిత సంబంధాలే ఉండేవి. ఇద్దరూ కలిసి సినిమా చేయాలని కూడా భావించారు. స్క్రిప్టులో కొన్ని మార్పులుచేర్పులను చిరంజీవి సూచించారు. అయితే.. అందుకు రాంగోపాల్ వర్మ ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా అటకెక్కింది. 1998లో ఆగిపోయిన ఈ సినిమాకు మణిశర్మ ట్యూన్స్ కూడా అందించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాతగా మొదలైన ఈ సినిమా ఇలా అర్ధాంతరంగా కాల గర్భంలో కలిసిపోయింది. ఈ సినిమాలో టబు హీరోయిన్. 'వినాలని ఉంది' అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం మణిశర్మ అందించిన రెండు పాటలను గుణశేఖర్, చిరు కాంబోలో తెరకెక్కించిన ‘చూడాలని ఉంది’ సినిమాలో వాడుకున్నారు.