డిజిటల్ తెరపై ఈ వారం వినోదాల జాతర మొదలైంది. స్పోర్ట్స్ డ్రామా నుంచి పీరియడ్ సోషల్ డ్రామా వరకు, గుండెలను పిండేసే ఎమోషన్స్ నుంచి స్ఫూర్తినిచ్చే కథల వరకు వైవిధ్యమైన కంటెంట్ ఓటీటీ ప్రియుల కోసం సిద్ధంగా ఉంది. ఈ వారం మీరు మిస్ అవ్వకూడదు అనుకునే మూడు కీలక చిత్రాల విశేషాలు మీకోసం..
ఎల్‌బీడబ్ల్యూ (LBW) – క్రికెట్ మీద లవ్..
విక్రాంత్ , నియాతి కాదంబి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్ ఎల్‌బీడబ్ల్యూ (LBW). ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫాం జీయో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. గణేష్ కార్తికేయన్ దర్శకత్వంలో దీనిని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. రంగన్ (విక్రాంత్) మాజీ క్రికెటర్. స్టార్‌బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకుంటాడు. కానీ.. కోపం, తప్పుడు నిర్ణయాలు, కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం వల్ల కెరీర్‌లో ఫెయిల్‌అవుతాడు. దాంతో ఆత్మవిశ్వాసం కోల్పోయి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అదే టైంలో ముత్తు నగర్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా చేరతాడు. ఆ అకాడమీ ఒకప్పుడు చాలా ఫేమస్. కానీ, ఇప్పుడు డౌన్‌ఫాల్‌లో ఉంది. ఫండింగ్ లేదు, మంచి ప్లేయర్స్ లేరు. టీమ్‌లో ఎవరికీ క్రమశిక్షణ ఉండదు. అకాడమీ హెడ్ రుక్మిణి (సింధు శ్యామ్) సాయంతో రంగన్ వాళ్లను బాగా ట్రైన్ చేసి, అకాడమీ లెగసీని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ. ఈ మూవీలో విక్రాంత్, నియాతి కాదంబితో పాటు సింధు శ్యామ్ తదితరులు కీలక పాత్రలో నటించారు.
హక్ (Haq) – తలాక్ పై చట్టపోరాటం!
యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ, షీబా చద్దా, ఎస్‌ఎం జహీర్, డానిష్ హుస్సేన్, వర్తికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హక్. సుపర్ణ్ వర్మ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫ్లాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 1970– 80ల నేపథ్యంలో సాగే కథ. సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన అబ్బాస్ ఖాన్ (ఇమ్రాన్ హష్మి) ఒక ప్రముఖ న్యాయవాది. మౌల్వీ బషీర్ (డానిష్ హుస్సేన్) కూతురు షాజియా బానో (యామీ గౌతమ్)ని పెండ్లి చేసుకుంటాడు. వాళ్లకు ముగ్గురు పిల్లలు. నాలుగోసారి ప్రెగ్నెంట్ అవుతుంది. షాజియాకు దైవభక్తి ఎక్కువ. ఒక రోజు అబ్బాస్ ఇంటికి తన రెండో భార్యను తీసుకొస్తాడు. మూడుసార్లు ‘తలాక్’ అని చెప్పి షాజియాకు డైవర్స్ ఇస్తాడు. అంతేకాదు.. ఆమెకు మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వడం కూడా మానేస్తాడు. దాంతో ఆమె న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తుంది. ఆమెకు తండ్రి బషీర్ అండగా నిలుస్తాడు. కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీల నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నిలుస్తోంది.
కుంకీ-2 – మనిషికి, మృగానికి మధ్య మమకారం
మథి, శ్రితారావు, అర్జున్ దాస్, సుజన్ జార్జ్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం కుంకీ2. ప్రభు సోలమన్ డైరెక్టర్ లో తెరకెక్కించి ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియాలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఇది 1980ల నాటి కథ. భూమి (మథి) అనే పిల్లవాడు అడవిలో ఒక చిన్న ఏనుగు పిల్లను చూస్తాడు. అది ఒకచోట చిక్కుకుపోయి ఉంటుంది. భూమి దాన్ని కాపాడి, తనతో తీసుకెళ్లి పెంచుకుంటాడు. దాన్ని ముద్దుగా నీలా అని పిలుస్తుంటాడు. తాగుడుకు బానిసైన భూమి తల్లి సుజన్ (సుజన్ జార్జ్) మాత్రం నీలా పెరిగిన తర్వాత అమ్మేయాలని ప్లాన్ చేస్తుంది. అందుకే అతను పెంచుకుంటాను అన్నప్పుడు అడ్డు చెప్పదు. అలా పన్నెండేండ్లు గడిచిపోతాయి. భూమి కాలేజీలో చదువుకుంటుంటాడు. అతను లేని టైంలో సుజన్ నీలాని అమ్మేస్తుంది. నీలా ఏమైందో తెలియక భూమి బాధపడతాడు. దాన్ని వెతుకుతూ అడవిలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ప్రకృతిని, మూగజీవాల పట్ల ప్రేమను చాటిచెప్పే ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
ఈ మూడు సినిమాలు కూడా మనిషిలోని పట్టుదల, హక్కులు, ప్రేమను ప్రతిబింబించేవే. ఈ వీకెండ్‌లో మీ మూడ్‌ని బట్టి ఒక మంచి స్పోర్ట్స్ డ్రామానో, సీరియస్ కోర్ట్ డ్రామానో లేదా ఎమోషనల్ ఫారెస్ట్ అడ్వెంచర్‌నో ఎంచుకుని ఎంజాయ్ చేయండి!
