ఓయూ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నట్లు రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించడం సిగ్గుచేటని ఓయూ జేఏసీ మండిపడింది. మునుగోడులోని ఉద్యోగులంతా టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాలని టీఎన్జీవో ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల రాజేందర్ పిలుపునివ్వడంపై ఓయూలోని స్టూడెంట్లు, నిరుద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద మామిడాల రాజేందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని..వారి తీరును ఖండిస్తున్నట్లు వెల్లడించారు. వైఖరి మార్చుకోకపోతే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు.
ఓయూ జేఏసీ నేత నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. చట్ట ప్రకారం ఉద్యోగ సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీలకు మద్దతు తెలపకూడదని గుర్తుచేశారు. రెండ్రోజుల క్రితం ప్రభుత్వానికి అనుకూలంగా రాజేందర్చేసిన కామెంట్లు సరికావన్నారు. ఆయన సీఎం కేసీఆర్ కు ఊడిగం చేయాలనుకుంటే వ్యక్తిగతంగా చేసుకోవాలని చెప్పారు. అంతేగాని ఉద్యోగులంతా టీఆర్ఎస్-కు మద్దతు పలుకుతున్నామంటూ చెప్పే అధికారం ఆయనకు లేదన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుతోన్న పార్టీకి ఉద్యోగులు మద్దతు తెలపడమేంటని నవీన్ ప్రశ్నించారు. ఒక వైపు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగులకు మరో మూడేళ్ల పాటు వయో పరిమితి పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో గడ్డం శ్రీను తదితరులు
పాల్గొన్నారు.
