పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలె: ఓయూ​ ప్రిన్సిపాల్

పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలె: ఓయూ​ ప్రిన్సిపాల్

ముషీరాబాద్, వెలుగు: పిల్లలు సెల్ ఫోన్లు వాడుతూ సైబర్ క్రైమ్​ల బారిన పడుతున్నారని ఓయూ లా కాలేజ్ ప్రిన్సిపాల్​డాక్టర్ రాధిక యాదవ్ అన్నారు. సెల్ ఫోన్ల కారణంగానే బాల నేరస్తుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ లో ‘క్రిమినల్ లా సమకాలీన సమస్యలు’ అనే అంశంపై రెండ్రోజుల పాటు జరిగిన నేషనల్ లా ఫ్యాకల్టీ డెవలప్​మెంట్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది. రాధిక యాదవ్, సీనియర్ అడ్వొకేట్ అశోక్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సీపీ నందిని, ఓయూ లా కాలేజ్ డిపార్ట్​మెంట్ హెడ్ ప్రొఫెసర్ ఎన్.వెంకటేశ్వర్లు, డాక్టర్ టి.అపర్ణ హాజరై బాల నేరస్తులకు సంబంధించిన చట్టాలు, వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి వివరించారు. 

రాధిక యాదవ్ మాట్లాడుతూ చిన్న కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందన్నారు. దీనితోపాటు పేదరికం, సైబర్ క్రైమ్ ల వల్ల వారికి తెలియకుండానే నేరాల్లో చిక్కుకుంటున్నారని తెలిపారు. అసోసియేట్ ప్రొఫెసర్ సీపీ నందిని మాట్లాడుతూ సమాజంలో ద్వేషం  పెరిగిపోయిందని..ఫలితంగా ద్వేషపూరితమైన నేరాలు, పరువు హత్యలు ఎక్కువయ్యాయన్నారు. మరిన్ని కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల ప్రిన్సిపాల్​ డాక్టర్ సృజన తోపాటు ఫ్యాకల్టీ పాల్గొన్నారు.