- పేపర్ వాల్యుయేషన్‌లో రూల్స్ బేఖాతర్
- ఆన్ లైన్‌లో దిద్దే పేపర్ల సంఖ్యను 60 నుంచి 80కు పెంచిన ఓయూ అధికారులు
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీతో పాటు దాని పరిధిలోని డిగ్రీ కాలేజీ స్టూడెంట్లకు జరుగుతోన్న 2,4,6 సెమిస్టర్ ఎగ్జామ్స్ ఈ నెల 25న పూర్తికానున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ కూడా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన రూల్స్‌ను ఓయూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక్కో ప్రొఫెసర్, లెక్చరర్లకు ఆన్లైన్లో వాల్యుయేషన్ చేయాల్సిన పేపర్ల సంఖ్యను ఒక్కసారిగా 60 నుంచి 80కి పెంచేశారు. దీని వల్ల వాల్యుయేషన్ సరిగా కాక.. స్టూడెంట్లు నష్టపోయే ప్రమాదముందని వారి తల్లిదండ్రులు, ఎగ్జామినర్లు చెప్తున్నారు. దీనివల్ల ఎగ్జామ్ రిజల్ట్స్ తొందరగా రావచ్చొమో కాని, స్టూడెంట్ల మార్కుల్లో తేడా వస్తోందంటున్నారు.
ఓయూ నిర్వహించే డిగ్రీ ఎగ్జామ్స్ పేపర్లను గతంలో స్పాట్ వాల్యుయేషన్ చేసేవారు. ఓయూలోని స్పాట్ వాల్యుయేషన్సెంటర్కు ప్రొఫెసర్లు, లెక్చరర్లను రప్పించి రోజుకు ఒక్కోక్కరికి 30 పేపర్లు ఇచ్చి దిద్దించేవారు. కరోనా ఎఫెక్ట్‌తో రెండేండ్లుగా స్పాట్ వాల్యుయేషన్ లేకపోవడంతో ఆన్ లైన్ విధానంలో పేపర్ వాల్యుయేషన్ చేయించారు. మొదట ఆన్ లైన్ వాల్యుయేషన్ పేపర్ల సంఖ్యను 30 నుంచి 60కి పెంచారు. ఈ ఎగ్జామ్స్ టైమ్ లోనే వాటిని 80కి పెంచారు. ఆదివారం రోజు పేపర్ వాల్యుయేషన్ చేసే ఒక్కో లెక్చరర్ కు 100 పేపర్లు కూడా ఇస్తున్నారు.ఇలా చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ చెప్తున్నారు.
ఇంటర్ కంటే తక్కువే ...
డిగ్రీ పేపర్ల వాల్యుయేషన్ కు ఇచ్చే డబ్బులు కూడా చాలా తక్కువని ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. ఇంటర్‌కు ఒక్కో పేపర్‌కు రూ.23 చెల్లిస్తుండగా, డిగ్రీకి మాత్రం ప్రస్తుతం ఒక్కో పేపరుకు రూ.15 వేలు చెల్లిస్తున్నారు. గతంలో టీఏ,డీఏలు కూడా ఇచ్చిన అధికారులు ఇప్పుడు అవి కూడా నిలిపివేశారని స్పాట్ వాల్యుయేషన్ కు వచ్చే ప్రొఫెసర్లు, లెక్చరర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పేపర్ల సంఖ్యను 60కు కుదించి పేపర్ వాల్యుయేషన్రెమ్యునరేషన్పెంచి తమకు న్యాయం చేయాలని ప్రొఫెసర్లు కోరుతున్నారు.
స్టూడెంట్లకు జరిగే నష్టం..
గతంలో డిగ్రీ పేపర్ల స్పాట్ వాల్యుయేషన్ ను ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించేవారు. ప్రస్తుతం ఒక వైపు ఎగ్జామ్స్ జరుగుతుండగానే.. మరోవైపు పూర్తయిన ఎగ్జామ్ పేపర్ల వాల్యుయేషన్ ను ఆన్ లైన్ లో కొనసాగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఓయూ పరిధిలో డిగ్రీ స్టూడెంట్లకు రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సెమిస్టర్ఎగ్జామ్స్ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నాయి. ప్రొఫెసర్లంతా ఎగ్జామినేషన్డ్యూటీలో సాయంత్రం 5 గంటల వరకు ఉండి ఇంటికి చేరుకునే సరికి రాత్రి ఏడు, ఎనిమిది కూడా అవుతోంది.
వారంతా ఇంటికి వచ్చాక ఆన్లైన్లో ఓయూ అధికారులు అప్ లోడ్ చేసే పేపర్లను పరిశీలించి వాల్యుయేషన్ చేస్తున్నారు. ఒక్కో ఆన్సర్ షీట్ బుక్‌లెట్‌లో 32 పేజీలు ఉంటాయి. ఈ పేజీలన్నీ పరిశీలించడం తప్పని సరి. అయితే వారంతా రాత్రి 9 గంటలకు పేపర్‌వాల్యుయేషన్ మొదలు పెట్టి రాత్రి 12 గంటల లోపు పూర్తి చేయాలి. రాత్రి 12 గంటలు దాటితే అది మరుసటి రోజు కింద లెక్క పెడతారు. దీంతో వారంతా నిర్ణీత టైమ్‌లో పూర్తి చేయాలనే తొందరలో వాల్యుయేషన్చేయడంతో మానసిక ఒత్తిడికి గురై పేపర్ కరెక్షన్ సరిగా చేయలేక మార్కుల విషయంలో స్టూడెంట్లకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు ప్రొఫెసర్లే పేర్కొంటున్నారు.
