ఓయూ పీహెచ్​డీ ఫీజులు తగ్గించాలి.. మంత్రి సబితకు వినతి

ఓయూ పీహెచ్​డీ ఫీజులు తగ్గించాలి.. మంత్రి సబితకు వినతి

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో పెంచిన పీహెచ్​డీ కోర్సు ఫీజును వెంటనే తగ్గించాలని ఓయూ రీసెర్చ్ స్కాలర్స్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, మేనేజ్​మెంట్​, కామర్స్, ఎడ్యుకేషన్, ఓరియెంటల్, లాంగ్వేజెస్ కోర్సులకు పీహెచ్​డీలో సంవత్సరానికి రూ.2,000గా ఉన్న ఫీజును అమాంతం రూ.20,000కు పెంచారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ లెక్కన కోర్సు పూర్తయ్యేనాటికి మొత్తం ఫీజు రూ. లక్ష అవుతుందని, అలాగే సైన్సెస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లోనూ ఏడాది ట్యూషన్ ఫీజు రూ.25,000కు పెంచారని తెలిపారు. అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి 4 రోజుల పరిమిత సమయం అనే రూల్​ను కొత్తగా తీసుకొచ్చారని,  దీంతో తాము అప్పులు చేసుకుని ఫీజులు కట్టాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.   ఓయూ వీసీని పిలిపించుకొని మాట్లాడతానని మంత్రి సబిత హామీ ఇచ్చారని అనంతరం వారు మీడియాకు వెల్లడించారు. నెల్లి సత్య, ఆజాద్, మహేష్, కిరణ్ తదితరులు మంత్రిని కలిశారు.