జైలు నుండి విడుద‌లైన ప్రోఫెస‌ర్ కాశీం

జైలు నుండి విడుద‌లైన ప్రోఫెస‌ర్ కాశీం

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో నాలుగు నెలల క్రితం అరెస్ట్ అయిన ప్రోఫెస‌ర్ కాశీం బుధ‌వారం చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి విడుదల అయ్యారు. ములుగు,వరంగల్, రంగారెడ్డి జిల్లాల కోర్టులు బెయిలు మంజూరు చేయడంతో నాలుగు నెలల తర్వాత జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..తాను అరెస్ట్​ అయినప్పటినుండి త‌న విడుదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేప‌ట్టిన వివిధ‌ సంఘాల నాయకులకు, విద్యార్ధులకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు నెలలుగా ఏదో ఒక సందర్భంలో త‌న‌కు సంబంధించిన వార్తలను సమాజానికి అందిస్తున్న ప్రింట్​ మీడియా, ఎలక్ట్రానిక్​ మీడియా యాజమాన్యం, జర్నలిస్టులకు, ఎడిటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

యూనివర్సిటిలో విద్యార్ధులకు పాఠాలు చెప్పే టీచర్ ని… కరోనా వలన అకాడమిక్​ వాతావరణం డిస్టబ్​ అయిపోయి ఉన్నది కాబ‌ట్టి పరిశోధన, అధ్యాపన, అధ్యాయనం అనే మూడు విషయాలపై దృష్టిపెట్టాలని భావిస్తున్నానని కాశీం చెప్పారు. అలాగే ఈ దేశంలో దళితులు చాలా బాధలు పడుతున్నారు గనుక ఆ దళితులకు, లేదా బహుజనులకు సంబంధించిన వారి జీవితాలకు సంబంధించిన విషయాల మీద ఆలోచిస్తూ, రాస్తూ ఉండాలని అనుకుంటున్నానన్నారు.

అన్ని సందర్భాల్లో అన్ని రకాలుగా త‌న‌ కుటుంబానికి, త‌న‌కు మానసిక ధైర్యాన్నిచ్చిన రెండు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన‌ని ప్రొఫెసర్​ కాశీం తెలిపారు.

OU Professor Kasim released from Cherlapally Central Jail on Wednesday