ఉస్మానియా వర్సిటీలో.. ఆంక్షలు ఎత్తేయాలి: విద్యార్థి సంఘాలు

ఉస్మానియా వర్సిటీలో.. ఆంక్షలు ఎత్తేయాలి: విద్యార్థి సంఘాలు

ఓయూ, వెలుగు : ఓయూ వర్సిటీ వీసీ ప్రొ.రవీందర్​ను వెంటనే తొలగించాలని  ఓయూ విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి. ఆయన విద్యార్థి వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని  తెలిపాయి. వర్సిటీలో విద్యా వాతావరణాన్ని కాపాడాలని వీసీని కలిసేందుకు వెళ్లిన స్టూడెంట్లను పరిపాలనా భవనం వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన విద్యార్థి సంఘాల నేతలు .. అడ్మినిస్ర్ర్టేటివ్​ బిల్డింగ్​ గేట్లను , బారికేడ్లను తొలగించి వీసీ చాంబర్​ లోకి దూసుకువెళ్లారు. అనంతరం  రవీందర్​కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నేతలు కోట శ్రీనివాస్​గౌడ్​, నెల్లి సత్యమాట్లాడుతూ.. వీసీ విద్యార్థులకు ఉపయోగపడే నిర్ణయాలు కాకుండా వారికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆరోపించారు.ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో  ఓయూ విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, ప్రత్యేక రాష్ర్టం ఆవిర్భవించాక వర్సిటీలో సభలు, సమావేశాలను నిషేధించారని విమర్శించారు.

వివిధ కోర్సులకు పెంచిన ఫీజులు తగ్గించాలన్నారు. క్యాంపస్​కు ఇరువైపులా రాత్రి సమయాల్లో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, ముళ్ల కంచెలను వెంటనే తొలగించాలని చెప్పారు.  బీ-సెక్యూర్​ ఏజెన్సీని రద్దు చేసి ఏండ్లుగా  పనిచేస్తున్న  స్థానికులైన  తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ బస్సులను యూనివర్సిటీలోకి అనుమతించాలని కోరారు.  వీసీకి వినతి పత్రం సమర్పించిన వారిలో  బాల లక్ష్మి,గ్యార నరేశ్​, లెనిన్​, సతీష్​, వలిగొండ నర్సింహ్మా, సమీర్​, ప్రసాద్​ఉన్నారు.