ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి టీఆర్ఎస్కు ఓటెయ్యుమంటరా?

ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి టీఆర్ఎస్కు ఓటెయ్యుమంటరా?
  • టీఎన్జీవో, టీజీవో నేతలపై ఓయూ నిరుద్యోగ జేఏసీ ఫైర్
  • ఉద్యోగులను, నిరుద్యోగులను అవమానించారని ధ్వజం 

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులను, నిరుద్యోగులను అవమానించిన టీఎన్జీవో, టీజీవో నేతలు మామిళ్ల రాజేందర్, మమత క్షమాపణలు చెప్పాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత సురేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటెయ్యాలని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. మంగళవారం నాంపల్లి టీఎన్జీవో భవన్ లో సురేశ్​తో పాటు, మరి కొంత మంది ప్లకార్డులు చేతిలో పట్టుకుని ఆందోళన చేశారు. మామిళ్ల రాజేందర్ నేమ్ ప్లేట్​ను చెప్పుతో కొట్టి పగులగొట్టారు. నేతల సొంత లాభం కోసం యూనియన్లను తాకట్టు పెడుతున్నారని సురేశ్ మండిపడ్డారు. ఉద్యోగులు, టీచర్ల త్యాగాలను నేతలు అవమానపరుస్తూ కేసీఆర్ మెప్పు కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు లేట్​గా వస్తున్నాయని, ఈహెచ్ఎస్ అమలు కాకపోయినా ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు పెండింగ్ లో ఉన్నాయని, రిటైర్ అయిన వారికి ప్రభుత్వం సెటిల్మెంట్ పూర్తి చేయటం లేదన్నారు. 

దాడిని ఖండిస్తున్నాం: రాజేందర్, ప్రతాప్    
టీఎన్జీవో ఆఫీసుకు తాము లేని టైంలో వచ్చి, తన నేమ్ ప్లేట్​ను పగల కొట్టడం సరికాదని టీఎన్జీవో ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్, జనరల్ సెక్రటరీ ప్రతాప్ అన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసిన టీఎన్జీవోపై కొందరు తమ ఉనికిని కాపాడుకోవటానికి, వ్యక్తిగత గుర్తింపు కోసం దాడి చేయటం సమంజసం కాదని, ఈ దాడిని ఖండిస్తున్నామని అన్నారు.