ఓయూ కాన్వొకేషన్..సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్

ఓయూ కాన్వొకేషన్..సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్

ఓయూ 82వ కాన్వొకేషన్ ను గ్రాండ్ గా నిర్వహిస్తామని ఓయూ వీసీ రవీందర్ తెలిపారు. శుక్రవారం జరగనున్న ఈ కాన్వొకేషన్కు సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్ తమిళసై హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కాన్వొకేషన్ లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఓయూ గౌరవ డాక్టరేట్ అందుకోనున్న ఐదవ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కాగా..ఇప్పటి వరకు 47మందికి ఓయూ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. లా డిపార్ట్మెంట్ లో 29, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ 12, సైన్స్ లో ఆరుగురికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. 

కాన్వొకేషన్ ను అడ్డుకుంటాం

ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కాన్వొకేషన్ లో 31మంది విద్యార్థులు 55 గోల్డ్ మెడల్స్ అందుకోనున్నారు. గోల్డ్ మెడల్స్ అందుకునేవారిలో 27మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. 260 మంది స్కాలర్స్ పీహెచ్డీ పట్టా అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పాసులు ఇచ్చిన విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుందని వీసీ తెలిపారు. అయితే పాత పద్ధతిలోనే పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గత కొన్ని రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే ఓయూ కాన్వొకేషన్ అడ్డుకుంటామని వారు తెలిపారు.