ఓవైపు అడిలైడ్ ఘోర పరాజయాన్ని పూర్తిగా మరవకముందే.. మరోవైపు మెల్‌బోర్న్‌లో మన రికార్డు దడ పుట్టిస్తోంది..! సూటబుల్ కండిషన్స్‌లోనే అత్యంత చెత్తాట ఆడిన టీమిండియా.. పేస్, బౌన్స్‌కు నిలయమైన ఎంసీజీ గ్రీన్ టాప్ వికెట్‌పై ఎలా ఆడుతుందన్న సందేహాలు అప్పుడే మొదలయ్యాయి..! నిఖార్సైన సారథి లేని సేన.. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన టైమ్‌లో… కంగారూల సూపర్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలుస్తుందా..! పరాజయాలకు తావుగా మారిన మెల్‌బోర్న్‌లో గెలుపు పాగా వేస్తుందా? 2018 హిస్టరినీ రిపీట్ చేస్తుందా?
వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : తమ టెస్ట్ హిస్టరీలోనే అత్యంత చెత్త పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో లెక్క సమం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా శనివారం మొదలయ్యే బాక్సింగ్ డే టెస్ట్ కోసం భారీ మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తోంది. అయితే టీమ్ అన్న తర్వాత మార్పులు సహజమే అయినా.. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న మెల్‌బోర్న్‌లో టీమిండియా రికార్డే ఏమాత్రం బాగాలేదు. ఈ మైదానంలో మెరుపులు మెరిపించిన టీమిండియా వీరులనూ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అనుక్షణం సవాల్ విసిరే కండిషన్స్.. ఇండియాకు ఏమాత్రం సూట్‌కావు. అక్కడ ఆడిన చాలా మంది ప్లేయర్లు చెబుతున్న మాట కూడా ఇదే. అందుకే ఆసీస్ మాజీలు కూడా సిరీస్‌లో ఇండియాకు వైట్‌వాష్ తప్పదని అప్పుడే ఓ అంచనాకు వచ్చేశారు. కనీసం మనకు సూటయ్యే కండిషన్స్ ఉన్న అడిలైడ్‌లో గెలిచి ఉంటే ఇక్కడ కాస్తోకూస్తో పోరాడే వాళ్లం. కానీ ఒకే ఒక్క గంటలో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎంసీజీలో మన అదృష్టం మారుతుందా? లేదా? చూడాలి.
ఒక్కటి గెలవడమే కష్టం..
ఆసీస్‌లో ఒక మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలిచినంత సంబరపడిపోతాయి విదేశీ టీమ్‌లు. ఎందుకంటే వాళ్ల గడ్డపై కంగారూలను కొట్టే శక్తి, సత్తా, సామర్థ్యం, నైపుణ్యం.. వరల్డ్ క్రికెట్‌లో చాలా టీమ్‌లకు లేవు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఇది. మధ్యలో ఒకటి, రెండు జట్లు విజయాలు సాధించినా.. తర్వాతి దశల్లో వాటిని నిలబెట్టుకోలేకపోయాయి. ఆసీస్ సిరీస్ కోల్పోయిందంటే.. ఆ టైమ్‌లో టీమ్ బ్యాలెన్స్ కరెక్ట్‌గా లేకపోవడమైనాకావాలి. లేదంటే కీలక ప్లేయర్లు గాయాలబారిన పడటమైనా జరిగి ఉండాలి. ఈ రెండు కాకుండా మూడో కారణం వెతికినా దొరకదు. ముఖ్యంగా ఐదు రోజుల ఫార్మాట్‌లో ఆసీస్‌కు ఎదురొడ్డి నిలవాలంటే ప్రత్యర్థి టీమ్ చాలా అదృష్టం చేసుకోవాలి. అపోజిషన్ టీమ్‌లో వ్యక్తిగతంగా ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు రాణించినా.. తుది ఫలితం మాత్రం ఆసీస్‌దే ఉంటుంది. అయితే సౌరవ్ గంగూలీ రాకతో ఆసీస్ గడ్డపై ఇండియా పెర్ఫామెన్స్ కాస్త మెరుగైనా.. ధోనీ ఆధ్వర్యంలో పోటీనిచ్చే స్థాయికి వచ్చింది. 2018లో సిరీస్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసినా.. అడిలైడ్ ఓటమితో అది మరుగున పడింది.
ముచ్చటగా మూడు..
ఎంసీజీలో ఇప్పటివరకు ఇండియా 13 మ్యాచ్‌లు ఆడితే ముచ్చటగా మూడింటిలో గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడి.. మరో రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఈ రికార్డును గుర్తు చేసుకుంటే ఈసారి కూడా గెలవడం కష్టమేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్‌లో 1–0 లీడ్‌తో ఉన్న ఆసీస్ కచ్చితంగా చెలరేగిపోతుంది. కంగారూలను అడ్డుకోవడానికి అవసరమైన ఎక్స్‌పీరియెన్స్ ఇప్పుడున్న టీమిండియా దగ్గర ఉందని అనుకోవడం లేదు. దీనికితోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ.. టీమ్ పెర్ఫామెన్స్‌పై చాలా ప్రభావం చూపే చాన్స్ ఉంది.
ఫైనల్ ఎలెవన్ కుదిరితే..
పాత రికార్డులను చెరిపేయాలంటే లాస్ట్ రెండు టూర్లలో సాధించిన సక్సెస్‌ను ఎంసీజీలో టీమిండియా రిపీట్ చేయాలి. ఇది జరగాలంటే ఫైనల్ ఎలెవన్ కుదరాలి. ప్రస్తుతానికైతే టీమిండియా తుది కూర్పులో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. పెటర్నిటీ లీవ్‌లో ఉన్న విరాట్ ప్లేస్‌ను భర్తీ చేసే మొనగాళ్లు లేకపోయినా.. ఆ స్థాయిలో బ్యాలెన్స్ చేస్తే చాలు. మరి ఆ బ్యాట్స్‌మన్ ఎవరు..? రిస్ట్ ఇంజ్యురీతో టీమ్‌కు దూరమైన షమీని మరిపించేలా మరో యంగ్ పేసర్ బయటకు రావాలి. అతను ఎవరు..? భారీ ఓపెనింగ్ ఇచ్చే ఇద్దరు ప్లేయర్లు ఇప్పుడు ఇండియాకు అత్యవసరం. వాళ్లిద్దరు ఎవరు..? మిడిలార్డర్‌లో పుజారా, రహానెకు అండగా నిలిచే మిగతా వాళ్లు ఎవరు..? ఇవన్నీ కుదిరినా టీమ్ స్ట్రాటజీ ఏంటీ? ఐదుగురు బౌలర్లతో దిగుతారా? బ్యాటింగ్ డెప్త్ కోసం స్పిన్ ఆల్‌రౌండర్‌కు చాన్స్ ఇస్తారా? వీటన్నింటికీ సమాధానాలు వెతకాల్సిందే. నిక్కచ్చిగా చెప్పాలంటే.. ఇప్పుడు టీమిండియా గాయపడిన పులి. దాని నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉండాలే తప్ప.. గతాన్ని గుర్తు చేసేలా ఉండకూడదు. లాస్ట్‌కు ఎంసీజీ రికార్డు మరోసారి వెక్కిరించినా.. కనీసం డ్రాతోనైనా గట్టెక్కి సిరీస్ పోకుండా పరువు కాపాడుకోవాలి.
హిస్టరీ క్రియేట్ చేశారు..
ఎంసీజీలో చాలా మ్యాచ్‌ల్లో ఓడినా.. 2018–19 టూర్ మాత్రం టీమిండియాకు మరపురాని అనుభవాన్ని మిగిల్చింది. డిసెంబర్ 2018లో ఇక్కడ జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఇండియా 137 రన్స్ తేడాతో ఆసీస్‌పై గెలిచింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1 లీడ్‌ను సాధించింది. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (6/33) మ్యాజిక్ స్పెల్‌తో ఇండియాను గెలిపించాడు. ఆసీస్ గడ్డపై టీమిండియా బౌలర్లలో ఇదే బెస్ట్ పెర్ఫామెన్స్. నాలుగో టెస్ట్‌ను డ్రా చేసుకున్న కోహ్లీసేన.. గతంలో ఏ టీమ్ సాధించని సిరీస్‌ను ఫస్ట్ టైమ్ సొంతం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో ఇంగ్లండ్ తర్వాత ఆసీస్‌ను నిలువరించిన రెండో టీమ్‌గా ఇండియాకు పేరొచ్చింది. 2014లో ఇక్కడే జరిగిన టెస్ట్‌ను టీమిండియా డ్రా చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ 530 రన్స్ చేస్తే.. బదులుగా ఇండియా 465 రన్స్ సాధించింది. ఎంసీజీలో ఇండియాకు ఇదే హయ్యెస్ట్ స్కోర్. 1977లో ఆసీస్ గడ్డపై ఇండి యాకు ఫస్ట్ టెస్ట్ విక్టరీ కూడా ఇదే వేదికపై రావడం మరో విశేషం. ఆ తర్వాత 1981లో గుండప్ప విశ్వనాథ్ చలువతో మళ్లీ గెలిచింది. ఈ మూడు విజయాలు మినహా.. ఎంసీజీలో మన ఆట అంతంత మాత్రంగానే ఉంది.

