మా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్రు

మా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్రు
  • 11 రోజులుగా దీక్ష చేస్తున్న ఓ కుటుంబం
  • గత తహసీల్దార్‌‌పై ఏసీబీ డీఎస్పీకి  ఫిర్యాదు 

ధర్మసాగర్, వెలుగు: తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఓ కుటుంబం 11 రోజులుగా నిరసన దీక్ష చేస్తోంది.  వారి వివరాల ప్రకారం..  హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్లకు చెందిన వంగాల నారాయణరెడ్డికి గ్రామంలో సర్వే నెం.212/బిలో 3 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. ఇది అతనికి వారసత్వంగా రాగా.. ఆయనే  కబ్జా, కాస్తులో ఉన్నారు. ఈ భూమిని 2017లో అదే గ్రామానికి చెందిన వంగాల మురళీధర్ రెడ్డి, రాంరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించారు. 

విషయం తెలుసుకున్న నారాయణ రెడ్డి దీనిపై అభ్యంతరం చెబుతూ ఆర్డీవో, తహసీల్దార్‌‌కు ఫిటిషన్ ఇచ్చారు. ఇదేమీ పట్టించుకోని గత తహసీల్దార్ రజని ఆరు నెలల కింద వంగాల రాంరెడ్డికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో నారాయణరెడ్డి, తన భార్య లలిత, కొడుకులు, కోడళ్లతో కలిసి ఈ నెల15న  గ్రామంలోని బొడ్రాయి వద్ద టెంట్​ వేసుకుని దీక్ష చేపట్టారు. 

 ఈ విషయమై తహసీల్దార్ సదానందం గ్రామానికి వెళ్లి దీక్ష చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు.  ఆ స్థలం వివాదం కోర్టులో ఉందని, దీక్ష విరమిస్తే న్యాయం చేస్తామని మాటిచ్చారు. రెవెన్యూ శాఖ నుంచి ఆర్డర్ కాపీ ఇస్తేనే దీక్ష విరమిస్తామంటూ నారాయణ రెడ్డి చెప్పడంతో తహసీల్దార్‌‌ వెళ్లిపోయారు.  కాగా, గత తహసీల్దార్‌‌ రజిని కోర్టులో కేసు ఉండగానే డబ్బులు తీసుకొని రాంరెడ్డికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, ఇటీవల అక్రమ ఆస్తుల కేసులో ఆమెను అరెస్ట్ చేసిన కరీంనగర్ ఏసీబీ డీఎస్పీకి మంగళవారం నారాయణ రెడ్డి కొడుకు ఫిర్యాదు చేశాడు.