మా భూములు గుంజుకుండు.. న్యాయం చేస్తలేడు

మా భూములు గుంజుకుండు.. న్యాయం చేస్తలేడు

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ధర్నా చేయడానికి వస్తున్న చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులను మునుగోడు రాకుండా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. తాము ఓట్లేస్తేనే కేసీఆర్ గెలిచిండన్న నిర్వాసితులు... తమ భూములు గుంజుకుండని ఆరోపించారు. తమకు న్యాయం చేస్తలేడు అంటూ నిర్వాసిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజులుగా మర్రిగూడెం మండల కేంద్రంలో దీక్ష  చేస్తున్నా అధికారులు గానీ, అధికార పార్టీ గానీ, మంత్రి గానీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గం కేంద్రంగా ఆందోళన చేయడానికి వస్తోన్న నిర్వసితులను పోలీసులు అడ్డుకున్నారు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా చర్లగూడెం రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. ఇంతకు మునుపు కూడా వీళ్లు నిరసన వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రాజెక్టు పనులను సైతం వారు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వీరి ఉద్యమానికి పలు రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీ మద్దతు ప్రకటించాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని అప్పట్లో అడిషనల్ కలెక్టర్ చెప్పినా అవి కేవలం మాటలకే పరిమితం కావడంతో ఇటీవల మళ్లీ చర్లగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులను ఆందోళన బాట పట్టారు.