అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. నవంబర్ 21న బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్ చెప్పిన విశేషాలు.
అఖిల్ రాజ్ మాట్లాడుతూ ‘పలు షార్ట్ ఫిలింస్‌లో నటించిన నేను ఆడిషన్ ద్వారా ఈ సినిమాకు సెలెక్ట్ అయ్యా. ఒక ఊరిలో జరిగిన యాదార్ధ ఘటనే ఈ సినిమా. నా క్యారెక్టర్ కోసం రెండు నెలలు డప్పు కొట్టడం నేర్చుకున్నా. నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయి. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులు ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారు అనేది ఈ మూవీ కథ. చాలా ఇంటెన్స్ స్టోరీ ఇది.
నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం విషాదకరం. ఆ ప్రేమికులు ఈ ఘటనను ఎలా డీల్ చేశారో అని బాధగా అనిపించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మా జీవితాలు మారిపోతాయి’ అని చెప్పాడు. హీరోయిన్ తేజస్విని మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో రాంబాయి పాత్రలో కనిపిస్తా. ఆ క్యారెక్టర్‌లో అనేక లేయర్స్ ఉన్నాయి. తను ప్రేమికుడు రాజు దగ్గర హ్యాపీగా ఉంటుంది, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడుతుంది, తన ప్రేమను తండ్రి అంగీకరించాలని తపన పడుతుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టం’ అని చెప్పింది
