మా ఎమ్మెల్యే అవమానిస్తుండు..మంత్రులకు లోకల్​ లీడర్ల ఫిర్యాదు

మా ఎమ్మెల్యే అవమానిస్తుండు..మంత్రులకు లోకల్​ లీడర్ల ఫిర్యాదు
  • రాజధాని చేరుకున్న ఆలంపూర్​టీ ఆర్ఎస్ ​నేతలు
  • ఎమ్మెల్యే అవమానిస్తున్నాడని ఆగ్రహం

గద్వాల, వెలుగు: ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంపై సొంత పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక  లీడర్లు భగ్గుమంటున్నారు. తమను ఎమ్మెల్యే అవమానాలకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మంగళవారం అందరూ కలిసి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లతో పాటు టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడిని కలిసి కంప్లయింట్​ చేశారు. ఎమ్మెల్యే ఏం చేసినా పార్టీ కోసం ఇంతకాలం భరించామని, తమ ఓపిక నశించిందని మంత్రుల దగ్గర వాపోయారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి , ఉండవెల్లి, అలంపూర్, ఇటిక్యాల,  ఐజ జడ్పీటీసీ మెంబర్లు రాములమ్మ, శంషాద్ బేగం, హనుమంతరెడ్డి, పుష్పమ్మ, రాజోలి, ఐజ, ఇటిక్యాల ఎంపీపీలు మరియమ్మ,  నాగేశ్వర్ రెడ్డి, స్నేహ, ఇటిక్యాల, మానవపాడు, ఐజ  పీఏసీఎస్​ చైర్మన్లు రంగారెడ్డి, శ్రీధర్ రెడ్డి,  మధుసూదన్ రెడ్డి, ఐజ మున్సిపల్ చైర్ పర్సన్ దేవన్న, ఆలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామదేవరెడ్డి తదితరులు మంత్రులను కలిశారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్​ చెక్కులను మండలాల్లో పంపిణీ చేయాలని కేటీఆర్​ ఆదేశించినా పట్టించుకోకుండా, ఎమ్మెల్యే తన క్యాంపు ఆఫీసులోనే పంచుతున్నారని చెప్పారు. ఒక్కడే కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో తమకు గౌరవం లేకుండా పోతోందన్నారు. తమ మండలాలకు వచ్చినప్పుడు కూడా ప్రొటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు.  నియోజకవర్గ అభివృద్ధి నిధులను టీఆర్ఎస్ వ్యతిరేకులకు కేటాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రతిపనిలో కమిషన్లు తీసుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారని, ఆయన తీరువల్ల పార్టీ ప్రతిష్ఠ గంగలో కలుస్తోందని ధ్వజమెత్తారు. ప్రతి విషయంలో ఎమ్మెల్యే కొడుకు డాక్టర్​ అజయ్ జోక్యం పెరిగిపోయిందని ఆరోపించారు. 
ప్లీనరీ తర్వాత కేటీఆర్​ దగ్గరకు.. 
ఆలంపూర్​ఎమ్మెల్యేపై మంత్రులను కలిసిన టీఆర్​ఎస్​ లీడర్లు తర్వాత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన బుధవారం జరగనున్న పార్టీ ప్లీనరీ పనుల్లో బిజీగా ఉండడంతో తర్వాత కలవాలని సూచింనినట్టు తెలిసింది. 
అందుకేనా? 
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అబ్రహం భావిస్తున్నారు. లేని పక్షంలో తన కొడుకు డాక్టర్​అజయ్​కి సీటు ఇప్పించాలని చూస్తున్నారు. అలాగే మరోవైపు పంచాయతీరాజ్​ట్రిబ్యూనల్ మాజీ చైర్మన్​బండారి భాస్కర్, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఆయన కొడుకు మంద శ్రీనాథ్ రేసులో ఉన్నారు. జడ్పీ చైర్​పర్సన్​సరిత తిరుపతయ్య తన వర్గానికి చెందిన వారిని పోటీ చేయించాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబ్రహంపై కంప్లయింట్​ఇవ్వడం చర్చనీయాంశమైంది.