మా ఫోన్లూ హ్యాక్ అయితున్నయ్​.. కేటీఆర్, రేవంత్ ఆరోపణ..

మా ఫోన్లూ హ్యాక్ అయితున్నయ్​.. కేటీఆర్, రేవంత్ ఆరోపణ..
  • యాపిల్ అలర్ట్ మెసేజ్​లు ట్విట్టర్​లో పోస్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి హ్యాకింగ్ కలకలం రేగింది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని అటు అధికార, ఇటు ప్రతిపక్ష లీడర్లు ఆరోపిస్తున్నారు. తమకు యాపిల్ అలర్ట్ మెసేజ్ వచ్చిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ మెసేజ్ స్ర్కీన్ షాట్​లను ఇద్దరూ మంగళవారం ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘‘ప్రజల కోసం, వారి హక్కుల కోసం పోరాడడమే కాంగ్రెస్ ప్రాధాన్యం. తెలంగాణ ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తం. స్పై వేర్‌‌‌‌లతో అక్రమంగా మా ఫోన్లను హ్యాక్ చేయడం.. గోప్యత, వ్యక్తిగత గౌర వం, రాజకీయ హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. అయినా అవేవీ మమ్మల్ని ఏమీ చేయలేవు. మా చివరి శ్వాస వరకు రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం’’ అని రేవంత్ ట్వీట్ చేశారు. తమ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా.. తన ఫోన్​కు కూడా అలర్ట్ మెసేజ్ వచ్చిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘నా ఐఫోన్​కు కూడా త్రెట్​మెసేజ్​వచ్చింది. ప్రతిపక్ష నేతలపై దాడి చేయడానికి బీజేపీ ఎంతటికైనా దిగజారుతుందని మనకు తెలుసు. కాబట్టి ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించబోదు” అని ఆయన పేర్కొన్నారు.

నా ఫేస్​బుక్ ​అకౌంట్ హ్యాక్​చేశారు: రాణి రుద్రమ

తన ఫేస్ బుక్  అకౌంట్​ను హ్యాక్ చేశారని, ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​ను డిలీట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. దీని వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఐటీ హబ్ కేంద్రంగా కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల గొంతును ఇలా నొక్కేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు. ‘‘సిరిసిల్లలో కేటీఆర్ చేసిన దుర్మార్గాలు, వారి బంధువులు చేసే మాఫియా పనులు, అక్కడి ప్రజల కష్టాలను బయటి ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తాననే ఉద్దేశంతో నా అకౌంట్లను హ్యాక్ చేశారు. కానీ, కేటీఆర్ దుర్మార్గాలను బయటకు రాకుండా ఆపలేరు. తెలంగాణ, సిరిసిల్లలోని లక్షలాది సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కేటీఆర్ అక్రమాలను బయటపెడతాం” అని చెప్పారు. తన అకౌంట్లను హ్యాక్ చేసిన వారిని గుర్తించి, రికవరీ చేయాలని డీజీపీకి, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.