
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశ సమగ్రాభివృద్ధి, వికసిత భారత్‌కు సంబంధించిన బడ్జెట్ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఇది రాష్ట్రాలకు, ఎన్నికలకు సంబంధించిన బడ్జెట్ కాదని, ఇది దేశానికి సంబంధించినదని పేర్కొన్నారు.
కేవలం మంత్రిత్వ శాఖల వారిగా కేటాయింపులు ఉంటాయన్నారు. ఏపీకి సంబంధించిన కేటాయింపుల్లో పక్షపాతమేమి లేదన్నారు. గత ప్రభుత్వం ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిందని, అందువల్ల అమరావతి నిర్మాణానికి తమ బాధ్యతగా రూ.15 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున దాని గురించి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మల ప్రస్తావించారన్నారు.
అవహేళన చేసే హక్కు స్మితకు లేదు..
దివ్యాంగులను అవమానపరిచేలా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యవహరించారని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. దివ్యాంగులను అవహేళన చేసే హక్కు ఆమెకు లేదన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. తన తప్పును ఒప్పుకొని దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.