కొత్త రేషన్‌‌ కార్డులు 89 వేలకు పైనే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్పీడ్‌‌గా రేషన్‌‌ కార్డుల మంజూరు

కొత్త రేషన్‌‌ కార్డులు 89 వేలకు పైనే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్పీడ్‌‌గా రేషన్‌‌ కార్డుల మంజూరు
  • మీ–సేవ ద్వారా 1.18 లక్షల అప్లికేషన్లు
  • ఇప్పటికే 89,615 కార్డులు మంజూరు
  • మిగతా వాటి పరిశీలన పూర్తయితే లక్ష దాటనున్న కార్డుల సంఖ్య
  • రేపు తిరుమలగిరిలో సీఎం రేవంత్‌‌ చేతుల మీదుగా పంపిణీ

యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : కొత్త రేషన్‌‌ కార్డుల జారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త కార్డుల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మీ సేవ ద్వారా లక్షకు పైగా అప్లికేషన్లు అందగా.. ఇందులో ఇప్పటివరకు 89 వేలకు పైగా అప్లికేషన్లను ఆఫీసర్లు ఓకే చేశారు. మిగతా వాటి పరిశీలన కూడా పూర్తి అయితే మొత్తం కార్డుల సంఖ్య లక్ష దాటనుంది. మరో వైపు ప్రజాపాలన గ్రామసభల్లో వచ్చిన అప్లికేషన్ల వెరిఫికేషన్‌‌ సైతం కొనసాగుతోంది.

మీసేవ ద్వారా లక్షకు పైగా అప్లికేషన్లు

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్‌‌ రేషన్‌‌కార్డుల జారీ ప్రక్రియను పట్టించుకోలేదు. అన్ని స్కీమ్స్‌‌కు రేషన్‌‌కార్డు తప్పనిసరి కావడంతో కార్డు లేని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్‌‌ కార్డుల జారీతో పాటు  పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చింది. ఇందుకోసం మీ–సేవతో పాటు ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో సైతం అప్లికేషన్లు స్వీకరించింది. కొత్త రేషన్‌‌ కార్డుల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ – సేవ ద్వారా 1,18,681 అప్లికేషన్లు రాగా.. ప్రజాపాలన గ్రామసభల్లో 2,68,921 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం దరఖాస్తులను పరిశీలించి డబుల్‌‌ అప్లికేషన్లను తొలగిస్తున్నారు.

ఇప్పటికే 89 వేలకు పైగా అప్రూవ్‌‌

మీ – సేవ, ప్రజాపాలన గ్రామ సభల్లో వచ్చిన అప్లికేషన్లను ఆఫీసర్లు వెరిఫికేషన్‌‌ చేస్తున్నారు. మీ సేవలో వచ్చిన వాటిలో 75.5 శాతం అప్లికేషన్లను ఓకే చేశారు. ఇప్పటివరకు 89,615 కార్డులకు ఓకే చెప్పగా.. 3,636 కార్డులు రిజక్ట్‌‌ చేశారు. మరో 25,430 అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. మొత్తం వెరిఫికేషన్‌‌ పూర్తి అయితే ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డులు లక్ష దాటిపోనున్నాయి. మరో వైపు ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లలో 90 శాతం వెరిఫై చేసి 50 శాతం అప్లికేషన్లను అప్రూవ్‌‌ చేశారు. అలాగే పాత కార్డుల్లో మెంబర్లను యాడ్‌‌ చేయాలని కోరుతూ 2,58,154 అప్లికేషన్లు రాగా.. 2,33,902 మందికి ఓకే చేశారు. మరో 13,407 మెంబర్లను రిజక్ట్‌‌ చేయగా.. మిగిలినవి పెండింగ్‌‌లో ఉన్నాయి. ఇందులో కొన్ని అప్లికేషన్లు రెవెన్యూ ఇన్స్‌‌పెక్టర్‌‌ వద్ద పెండింగ్‌‌లో ఉండగా... మరికొన్ని తహసీల్దార్‌‌ లెవల్‌‌లో పెండింగ్‌‌లో ఉండగా.. ఇంకొన్ని డీఎస్‌‌వో వద్ద ఉన్నాయి.

14న  సీఎం చేతుల మీదుగా పంపిణీ..

ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించే సభలో సీఎం రేవంత్‌‌రెడ్డి చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక్కో మండలంలో ఇద్దరు చొప్పున కొత్త లబ్ధిదారులకు కార్డులు అందజేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆఫీసర్లు ఇప్పటికే పూర్తి చేశారు.

అర్హులందరికీ రేషన్ కార్డులు 

రేషన్‌‌ కార్డులు, మెంబర్ల యాడింగ్‌‌ కోసం వచ్చిన అప్లికేషన్ల వెరిఫికేషన్‌‌ రెగ్యులర్‌‌గా నడుస్తోంది. కొన్ని అప్లికేషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్‌‌లో ఉన్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌‌ కార్డులు ఇస్తాం. ఈ నెల 14న సీఎం రేవంత్‌‌రెడ్డి చేతుల మీదుగా కొత్త కార్డుల ప్రొసీడింగ్స్‌‌ అందజేస్తాం.

హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి

రేషన్‌‌ కార్డుల కోసం ఉమ్మడి జిల్లా  వ్యాప్తంగా వచ్చిన అప్లికేషన్లు

జిల్లా    అప్లికేషన్లు    అప్రూవ్‌‌    పెండింగ్‌‌    రిజెక్ట్​
యాదాద్రి    23,428    12,945    9536    947
నల్గొండ    62,052    52,542    7603    1907
సూర్యాపేట    33,201    24,128    8291    782

పాత కార్డుల్లో మెంబర్‌‌ యాడింగ్‌‌ కోసం..

జిల్లా    మెంబర్లు    అప్రూవ్‌‌    పెండింగ్‌‌    రిజక్ట్‌‌
యాదాద్రి    63,041    62,433    2040    4636
నల్గొండ    1,23,329    1,13,949    4090    5290
సూర్యాపేట    71,784    57,520    2040    3481