రాష్ట్రంలో లక్షా 69 వేల మందికి ‘షుగర్‌ ’

రాష్ట్రంలో లక్షా 69 వేల మందికి ‘షుగర్‌ ’
  • 12 జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. NPCDCS సర్వేలో వెల్లడి
  • పూర్తి కావొచ్చిన తొలిదశ సర్వే
  • సిద్ది పేట, జనగామలో 100% పూర్తి
  • 11 జిల్లాల్లో కొనసాగుతున్న రెండో దశ సర్వే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: లైఫ్ స్టయిల్​ వల్ల వచ్చే రోగాలపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎన్‌‌‌‌పీసీడీసీఎస్‌‌‌‌  సర్వే తొలిదశ పూర్తికావొచ్చింది. మధుమేహం, హైపర్‌‌‌‌‌‌‌‌ టెన్షన్‌‌‌‌ బాధితుల సంఖ్య తెలుసుకునేందుకు 2017  ఏడాది చివర్లో 12 జిల్లాల్లో వైద్య పరీక్షలు ప్రారంభించారు. ఇందులో సిద్దిపేట, జనగామ, కరీంనగర్​, మహబూబాబాద్​, సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్​ రూరల్​, వరంగల్​ అర్బన్​, మెదక్​, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలున్నాయి.

నాటి నుంచి నేటి వరకూ ఈ 12 జిల్లాల్లో 30 ఏండ్లు పైబడిన 32 లక్షల 2 వేల 820 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. సిద్దిపేట, జనగామ జిల్లాల్లో 100%, మరో 3 జిల్లాల్లో 90 శాతానికిపైగా సర్వే పూర్తయిందని, మొత్తంగా తొలిదశ సర్వే 83% పూర్తయిందని నివేదికలో ప్రస్తావించారు. 32 లక్షల 2 వేల 820 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 2 లక్షల 72 వేల 957 మందికి హైపర్‌‌‌‌‌‌‌‌ టెన్షన్‌‌‌‌, లక్షా 69 వేల 51 మందికి డయాబెటిస్‌‌‌‌ ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ట్రీట్‌‌‌‌మెంట్ ప్రారంభించామని తమ నివేదికలో అధికారులు పేర్కొన్నారు.

మరో 11 జిల్లాల్లో రెండో దశ సర్వేను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ 11 జిల్లాల్లోనూ 44% శాతం మందికి ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. జూన్‌‌‌‌ నుంచి మూడో దశగా మిగిలిన 10 జిల్లాల్లోనూ వైద్య పరీక్షలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులను ముందే గుర్తించి బాధితులను ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ‘నేషనల్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ ఫర్ ప్రివెన్షన్‌‌‌‌ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ ఆఫ్ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌, డయాబెటిస్‌‌‌‌, కార్డియోవాస్కులర్‌‌‌‌‌‌‌‌ డిసీజ్‌‌‌‌ అండ్‌‌‌‌ స్ర్టోక్‌‌‌‌(ఎన్‌‌‌‌పీసీడీసీఎస్‌‌‌‌)’ సర్వేను ప్రారంభించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి బాధితుల సంఖ్యను లెక్కిస్తున్నారు.