
టాలీవుడ్ హాస్య నటుడు ఫిష్ వెంకట్ ( Pish Venkat ) తెలుగు తెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సాగిన ఆయన కెరీర్ లో 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ.. జూలై 18న హైదరాబాద్ లో మరణించారు. కిడ్నీ మార్పిడి కోసం సుమారు రూ. 50 లక్షల ఆర్థిక సహాయం కోసం ఆయన కుటుంబం ఎదురుచూసింది. కానీ సాయం సమకూరముందే ఆయన మరణం అందరిలో విషాదాన్ని నింపింది.
గత కొన్ని నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్న ఫిష్ వెంకట్ చివరి రోజుల్లో వెంటిలేటర్ పై ఉండాల్సి వచ్చింది. కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. మూత్రపిండాల మార్పిడికి అత్యవసరంగా రూ.50 లక్షలు అవసరమని వైద్యులు సూచించారు. దీంతో మా నాన్నను బతికించుకోనేందుకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన కుమార్తె స్రవంతి బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. తెలుగు సినీపరిశ్రమ నుంచి పాక్షికంగా మద్దతు లభించినా సరైన దాత సకాలంలో దొరకలేదు. చివరకు వెంటిలేటర్ పై ఉన్న వెంకట్ మృతి చెందారు
ఈ విషాద వార్త విన్న నటుడు సోనూ సూద్ ( Sonu Sood ) దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. వారి కుటుంబానికి రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. వెంకట్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సహాయానికి వెంకట్ భార్య త్రీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త ఎల్లప్పుడూ సోనూను ఆరాధించేవాడని తెలిపారు.
సినీ ఇండస్ట్రీ నుంచి తగిన సాయం అంది ఉంటే నాన్న బతికేవారని వెంకట్ కుమార్తె స్రవంతి ఆవేధన వ్యక్తం చేసింది. వెంకట్ కిడ్నీ మార్పిడి కోసం నటుడు ప్రభాస్ రూ. 50 లక్షలు ఆఫర్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మొత్తాన్ని తాము ఎప్పుడూ అందుకోలేదని తరువాత స్పష్టం చేసింది. నాన్న చనిపోయే ముందు, విశ్వక్ సేన్ , పవన్ కళ్యాణ్ వంటి నటులు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారని తెలిపింది. సహాయం ఆలస్యం అయినప్పటికీ, సినీ సమాజం, ముఖ్యంగా సోను సూద్ చూపిన మద్దతు ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి కొంత ఓదార్పునిచ్చింది..