తత్వ రియల్ ఎస్టేట్ సంస్థకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్

తత్వ రియల్ ఎస్టేట్ సంస్థకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్: తత్వ రియల్ ఎస్టేట్ సంస్థకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. 2025, ఆగస్టు నెలాఖరు వరకు ముష్కి చెరువులో వేసిన మట్టిని తొలగించడంతో పాటు.. చెరువు పై భాగాన నిర్మించిన బండ్‎ను తొలగించాలని ఆదేశించారు. లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. 

అసలేమైందంటే..? 

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ముష్కి చెరువును సీఎస్ఆర్ కింద డెవలప్ చేస్తామని చెప్పి.. మట్టితో చెరువును పూడ్చి కబ్జా చేసింది తత్వ రియల్ ఎస్టేట్ సంస్థ. గతంలో 50 ఎకరాల వరకు ఉండే చెరువు ప్రస్తుతం 12 ఎకరాలకు కుంచించుకుపోయిందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానికులు, తత్వ రియల్ ఎస్టేట్ ప్రతినిధులతో హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ శుక్రవారం (జూలై 25) సమావేశమయ్యారు.

సీఎస్ఆర్ కింద చెరువును డెవలప్ చేస్తామని చెప్పి చెరువును చెర పట్టడమేంటని తత్వ రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రశ్నించారు రంగనాథ్. తత్వ సంస్థ యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రంగనాథ్.. 2025, ఆగస్టు నెలాఖరు వరకు చెరువులో వేసిన మట్టిని తొలగించడంతో పాటు.. చెరువు పై భాగాన నిర్మించిన బండ్‎ను తొలగించాలని ఆదేశించారు. లేదంటే క్రిమినల్ కేసులు పెడతామంటూ రియల్ ఎస్టేట్ సంస్థకు రంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.