
థాయిలాండ్-కంబోడియా మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం గురువారం ఒక్కసారిగా ఊపందుకుంది. థాయిలాండ్ కంబోడియా సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకొని వైమానిక దాడులు చేయగా, కంబోడియా రాకెట్లు, ఫిరంగి ప్రయోగించి దాడులను తిప్పి కొట్టింది. ఈ యుద్ధంలో ఎనిమిదేళ్ల బాలుడు, ఒక థాయ్ సైనికుడు సహా సుమారు 11 మంది థాయ్ పౌరులు మరణించారు. అంతేకాదు కంబోడియాకు చెందిన సైనికులు, పౌరులు కూడా మృతి చెందారు. మరోవైపు ఈ కాల్పులపై థాయిలాండ్ కంబోడియా, మొదట కాల్పులు జరిపింది మీరంటే మీరే అంటూ ఒకరి పై ఒకరు ఆరోపించుకున్నాయి.
ఈ వివాదం దేని గురించి: థాయిలాండ్ - కంబోడియా మధ్య వివాదం ఒక శతాబ్దానికి పై నాటిదే. 1953 వరకు కంబోడియాను ఆక్రమించిన ఫ్రాన్స్ మొదటిసారిగా సరిహద్దును గీసింది. 508 మైళ్ళు అంటే 817 కి.మీ కంటే పైగా ఉన్న ఈ సరిహద్దు వివాదం సంవత్సరాలుగా పదే పదే చెలరేగుతూనే ఉంది.
గత నెల మేలో ప్రారంభమైన కాల్పులలో ఒక కంబోడియా సైనికుడు చెనిపోగా, ఇందుకు ప్రతీకారంగా రెండు ప్రభుత్వాలు వరుసగా ఒకరిపై ఒకరు చర్యలు తీసుకున్నాయి. మొదట థాయిలాండ్ కంబోడియాపై సరిహద్దు ఆంక్షలు విధించగా, కంబోడియా పండ్లు ఇంకా కూరగాయల దిగుమతులను, థాయ్ సినిమాలను నిషేధించింది, అలాగే థాయిలాండ్ నుండి ఇంటర్నెట్ను తగ్గించింది.
గత బుధవారం రోజున పెట్రోలింగ్‌లో ఉన్న ఐదుగురు థాయ్ సైనిక సిబ్బంది ల్యాండ్‌మైన్ కారణంగా గాయపడటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ల్యాండ్‌మైన్‌లు కొత్తగా పెట్టారని ఆరోపించిన థాయ్ అధికారులు, కంబోడియాతో ఈశాన్య సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసి, కంబోడియా రాయబారిని బహిష్కరించారు.
థాయిలాండ్‌తో దౌత్య సంబంధాలు అత్యల్ప స్థాయికి దిగజారుతుండటం అలాగే బ్యాంకాక్‌లోని రాయబార కార్యాలయం నుండి మొత్తం కంబోడియా సిబ్బందిని వెనక్కి పిలిపిస్తున్నట్లు కంబోడియా తెలిపింది. అలాగే ల్యాండ్‌మైన్‌లు ఆరోపణలను కూడా ఖండించింది. కంబోడియా, థాయ్‌లాండ్ మధ్య జరుగుతున్న సరిహద్దు ఘర్షణలు రెండు దేశాల రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిరంకుశంగా పాలించిన హున్ సేన్, 2023లో తన కుమారుడు హున్ మానెట్కు అధికారం అప్పగించారు. హున్ సేన్ ప్రస్తుతం సెనేట్ అధ్యక్షుడిగా ఉంటూ దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. థాయ్‌లాండ్ కూడా రాజకీయల ఒత్తిడితో సతమతమవుతోంది. ప్రస్తుత ప్రధాన మంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రాను పదవి నుండి సస్పెండ్ చేశారు. పేటోంగ్‌టార్న్, ప్రముఖ మాజీ నాయకుడు థాక్సిన్ షినవత్రా కుమార్తె. హున్ సేన్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడిన ఒక రికార్డింగ్ బయటపడిన తర్వాత ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
►ALSO READ | కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
కంబోడియా, థాయ్‌లాండ్ మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కంబోడియా ఈ వివాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ముందుకు తీసుకెళ్లింది. అయితే, థాయ్‌లాండ్ కోర్టు అధికార పరిధిని అంగీకరించకపోవడంతో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆగ్నేయాసియా దేశాల ప్రాంతీయ కూటమి (ఆసియాన్) కు అధ్యక్షత వహిస్తున్న మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, థాయ్‌లాండ్ కంబోడియా కాల్పులు నిలిపివేయాలని పిలుపునిచ్చారు.
ఈ వివాదాన్ని పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించగవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కంబోడియా థాయ్‌లాండ్ రెండింటితో చైనాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. కానీ చైనా కంబోడియాకు మరింత సన్నిహితంగా ఉంటుందని భావిస్తున్నారు.
థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధానమంత్రి ఫుమ్తామ్ వెచాయాచాయ్ శాంతి చర్చలు ప్రారంభించే ముందు యుద్ధం ఆపాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభంపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయాలని కంబోడియా నాయకుడు హున్ మానెట్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరారు.