
జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 40 మందికిపైగా స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. కాగా.. బుధవారం రాత్రి వండిన చికెన్ కర్రీలో మసాలా, కారం ఎక్కువ అవ్వడం వల్లే స్టూడెంట్లు అజీర్తితో బాధపడడంతో పాటు వాంతులు చేసుకున్నారని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్యప్రసాద్ స్కూల్ ఆవరణలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇక్కడ కొందరు స్టూడెంట్లు ట్రీట్‌మెంట్‌తీసుకుంటుండగా... మరో ఐదుగురిని జగిత్యాల ఎంసీహెచ్‌కు తరలించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష గురుకులాన్ని సందర్శించి ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు.ఎంసీహెచ్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న స్టూడెంట్లను కలెక్టర్ పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
న్యాల్కల్ కస్తూర్బాలో ఐదుగురికి...
న్యాల్కల్, వెలుగు : సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ కస్తూర్బా గాంధీ స్కూల్‌లో ఐదుగురు కేజీబీవీ స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్‌లో చదువుతున్న స్వప్నబాయి, పూజ, మీనాక్షి, సాక్షి, సోనాబాయికి బుధవారం రాత్రి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. వీరిని గమనించిన మిగతా స్టూడెంట్లు స్కూల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్టూడెంట్లను వెంటనే న్యాల్కల్ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి జహీరాబాద్ ఏరియా హాస్పిటల్‌కు, అనంతరం సంగారెడ్డికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఈవో వెంకటేశ్వర్లు కేజీబీవీని సందర్శించి వివరాలు ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే స్టూడెట్లు అస్వస్థతకు గురై ఉంటారని అనుమానిస్తున్నారు.