
అవినీతికి పాల్పడే అధికారులు, సంస్థలపై చర్యలు తీసుకునేందుకు పరుగులు పెట్టే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పై పెండింగ్ కేసుల భారం ఉందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) వెల్లడించింది. 2024, డిసెంబర్ 31 నాటికి దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 7,072 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు CVC Report-2024 లో పేర్కొంది. అందులో 2,660 కేసులు పదేళ్లకు పైడా కొనసాగుతున్నాయని తెలిపింది.
మరీ ముఖ్యంగా ఇరవై ఏళ్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 379 కేసులు 20 ఏళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్నాయి. 2,281 కేసులు 10 నుంచి 20 ఏళ్ల మధ్యలో వాయిదాల్లోనే ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. 1506 కేసులు మూడేళ్లుగా పరిష్కృతం కాని కేసులని, 791 కేసులు ఐదేండ్లు, 2,115 కేసులు ఐదు నుంచి పదేళ్ల మధ్యలో పెండింగ్ లో ఉన్నవేనని తెలిపింది.
ఒకవైపు పరిష్కారానికి నోచుకోని కేసులు ఉండగా.. మరోవైపు రివ్యూ పిటీషన్ కారణంగా కోర్టుల్లో మగ్గుతున్న కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నట్లు రిపోర్టు వెల్లడించింది. 13 వేల ఒక వంద కేసులు వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులలో పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొంది. ఇందులో 606 అప్పీల్స్ 20 ఏళ్లుగా డిస్పోజల్ కోసం ఎదురు చూస్తున్నాయి. 1227 కేసులు 15 నుంచి 20 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోక కోర్టుల్లోనే మగ్గుతున్నాయి.
కేసులు పెండింగ్ లో ఉండటం వలన పనిభారం ఎక్కువవుతోందని.. దీంతో విచారణ కూడా ఆలస్యం అవుతోందని సీవీసీ రిపోర్టులో పేర్కొంది. సరిపడినంత సిబ్బంది లేకపోవడం, కేసులు ఎక్కువగా ఉండటం, తీర్పులు ఆలస్యమవటం కారణంగా కేసులు కుప్పలుకుప్పలుగా పెండింగ్ లో ఉంటున్నట్లు పేర్కొంది. సీబీఐ కేసులలో ఎక్కువ భాగం బ్యాంక్ మోసాలు, ఆర్ధిక నేరాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.