ఫెర్టిలిటీ సెంటర్ల దందాపై సర్కార్ సీరియస్.. ఇవాళ్టి (ఆగస్టు 02) నుంచి ప్రత్యేక తనిఖీలు

ఫెర్టిలిటీ సెంటర్ల దందాపై సర్కార్ సీరియస్.. ఇవాళ్టి (ఆగస్టు 02) నుంచి ప్రత్యేక తనిఖీలు
  • మూడేండ్లలో వెయ్యికిపైగా సరోగసీలు! 
  • అధికారికంగా వచ్చిన అప్లికేషన్లు 108 మాత్రమే
  • దందాకు తెరలేపిన ఫెర్టిలిటీ సెంటర్లు.. సర్కార్​ సీరియస్​
  • నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు..  అక్రమాలు తేలితే కఠిన చర్యలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో సరోగసీ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం శనివారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టనుంది. గత మూడేండ్లలో సరోగసీ కోసం అధికారికంగా కేవలం 108 దరఖాస్తులు వస్తే.. అనధికారికంగా వేయికి పైగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సరోగసి చేయకున్నా చేసినట్లు కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్లు తేల్చారు. సరోగసీ (నియంత్రణ) చట్టం- – 2021ను పలు ఫెర్టిలిటీ సెంటర్లు ఖాతరు చేయడం లేదని నిర్ధారణకు వచ్చారు. 

ఈ ముఠాలపై రాష్ట్ర సర్కార్  సీరియస్‌గా ఉంది. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఫెర్టిలిటీ సెంటర్ల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విషయంలో ఏం చేయాలనే దానిపై ఆరోగ్య శాఖ అధికారులు ఒక నివేదికను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. సరోగసీ కోసం 2023 నుంచి మూడేండ్లలో 108 దరఖాస్తులు రాగా.. వాటిలో 91కి సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. మూడు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 

29 కీలక అంశాలతో తనిఖీలు

ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వహణలో అక్రమాలు తేల్చేందుకు శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ తనిఖీల కోసం 35 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 307 ఫెర్టిలిటీ సెంటర్లను మూడు రోజుల పాటు పరిశీలించనున్నాయి. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీతా సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల్లో పూర్తి నివేదికను సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ రిపోర్ట్​ ఆధారంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులపై అవసరమైతే లైసెన్స్ రద్దు చేయడం, జరిమానాలు విధించడం, న్యాయపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో కొన్నేండ్లుగా ఫెర్టిలిటీ సెంటర్ల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఈ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 157 ఫర్టిలిటీ సెంటర్లను ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయి. ఆ తర్వాత రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని కేంద్రాల్లో సోదాలు నిర్వహిస్తాయి. ప్రతి బృందంలో ఒక వైద్య నిపుణుడు (డాక్టర్), ఒక డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇతర అధికారులు ఉంటారు. 

ఈ బృందాలు మొత్తం 29 కీలక అంశాలను పరిశీలించనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక చెక్‌ లిస్ట్‌ను సిద్ధం చేశారు. ఈ చెక్‌ లిస్ట్‌లో లైసెన్స్‌ల పరిశీలన, క్వాలిటీ ట్రీట్మెంట్, పేషంట్స్ రికార్డ్స్ నిర్వహణ, మందుల నిల్వ, సిబ్బంది అర్హతలు, శస్త్రచికిత్సల భద్రతా ప్రమాణాలు వంటి అంశాలు ఉన్నాయి.