ఈ మద్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు కరెంటు బిల్లు విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. కరెంటు బిల్లులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కూడా తనకు రూ. లక్షకు పైగా కరెంటు బిల్లు వచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ట్విటర్ లో ఈ విషయాన్ని తెలుపుతూ.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నవ్వుతున్న ఫోటోతో పాటు .. తనకు వచ్చిన కరెంట్ బిల్లు వివరాలను ఆదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఎఇఎంఎల్) కి కంప్లయింట్ ఇచ్చాడు. ఆదానిని ఒక హైవే దొంగ గా సంభోదిస్తూ.. తన సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశాడు.
అర్షద్ ట్వీట్‌పై స్పందించిన అదానీ ఎలక్ట్రిసిటీ.. తమ యజమాని గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుంటే ఫిర్యాదులను పరిష్కరిస్తామని చెప్పింది. ” మీ కరెంట్ బిల్లింగ్ సమస్యపై మీ ఆందోళనను మేము అర్థం చేసుకోగలం, కానీ మేము వ్యక్తిగతంగా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను సమర్ధించం, మా సూచనలు జాగ్రత్తగా పాటించమని సలహా ఇస్తున్నాం” అని అర్షద్‌కు రీట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో ” మీరు అభ్యంతరకరంగా చేసిన ట్వీట్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. మీ బిల్ వివరాలను మాతో పంచుకోవాలని అనుకుంటున్నాం” అని తెలిపింది. ఆ తర్వాత సోమవారం నాడు అర్షద్ వార్సీ, అదానీ ఎలక్ట్రిసిటీ ఇద్దరూ తమ ట్వీట్లను తొలగించారు.
ఈ గొడవ తర్వాత.. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై విద్యుత్ బిల్లులు మామూలు కంటే ఎందుకు ఎక్కువగా ఉన్నాయో వివరిస్తూ పలు పత్రికా ప్రకటనలను విడుదల చేసింది. వినియోగదారులు EMI ద్వారా తమ బిల్లులను చెల్లించవచ్చని తెలిపింది. ఈ సమస్యను పరిశీలించడానికి ముంబై అంతటా 25 హెల్ప్‌డెస్క్‌లు, 8 కస్టమర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

