- క్రిమినల్ కేసులు పెట్టినా కేర్ చేయని మిల్లర్లు
- వసూళ్ల కోసం అధికారులకు తప్పని తిప్పలు
జనగామ, వెలుగు : కస్టమ్‌మిల్లింగ్ రైస్బకాయిల వసూళ్లకు అధికారులు తిప్పలు పడుతున్నారు. జనగామ జిల్లాలోని నలుగురు మొండి రైస్ మిల్లర్లు రూ.10 కోట్ల విలువ చేసే సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా, కనీస పట్టింపు లేదు. అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు. ఆర్‌ఆర్‌యాక్టు ప్రయోగించినా పైరవీలతో కాలం గడుపుతున్నారు.
క్రిమినల్ కేస్‌పై కేర్ లెస్..
జనగామ జిల్లాలో రారైస్, బాయిల్డ్ రైస్ మిల్లులు సుమారు 60 వరకు ఉన్నాయి. వీటికి సంబంధించిన సీఎంఆర్ సేకరణ పై అధికార యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తాజా సీజన్ల పై నిఘా పెంచింది. త్వరగా లక్ష్యం చేరేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. కాగా, గతంలో మొండికేసి సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ల వద్ద నుంచి బకాయిలను వసూలు చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
పనిచేసే వారి వెంటే పడినట్లుగా అధికారులు సకాలంలో అందించే వారిపై ఒత్తిడి పెంచుతున్నారన్న అపవాదు ఉన్నది. జిల్లాలోని దేవరుప్పుల మండలం మన్‌పహాడ్ సాయిరాం మోడ్రన్ బిన్నీ రైస్‌మిల్ యాజమాన్యం ఏకంగా రూ.5,55,67,546 విలువైన సీఎంఆర్ ను సర్కారుకు అందించాల్సి ఉంది. 2022- 23 యాసంగి సీజన్‌కు చెందిన దీనిని ఇప్పటికీ ఇవ్వడంలేదు.
ఈ మిల్లుకు కేటాయించిన వడ్లను మిల్లర్ పక్కదారి పట్టించినట్టు గతేడాది అక్టోబర్‌లో అధికారులు దాడులు చేసి తేల్చారు. సీఎంఆర్ వడ్లు మాయంకావడంతో అప్పట్లో నోటీసులు జారీ చేశారు. ఫలితం లేకపోవడంతో క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆర్ఆర్ యాక్టు ప్రయోగించారు. సదరు మిల్లు యాజమాన్యానికి సంబంధించిన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. అయినప్పటికీ సదరు మిల్లర్ బకాయిలు చెల్లించలేదని అధికారులు చెప్పారు.
మరో మూడు మిల్లర్లు అదే దారి..
రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని రాజరాజేశ్వర రైస్‌మిల్లు యాజమాన్యం సైతం సీఎంఆర్ ఇవ్వకుండా సతాయిస్తోంది. గతేడాది అక్టోబర్ నుంచి ఇదే పరిస్థితి. దీంతో తాజాగా కేసులు నమోదు చేశారు. ఈ మిల్లు యాజమాన్యం 2023-–24 వానకాలం సీజన్‌కు సంబంధించి రూ.1,29,88,063ల విలువ చేసే సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా, మొండి కేస్తున్నారు. దీంతో రెవెన్యూ రికవరీ యాక్టు (ఆర్ఆర్) ద్వారా బకాయి వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా సివిల్సప్లై అధికారులు రఘునాథపల్లి తహసీల్దార్‌కు చర్యల కోసం తాజాగా లేఖ రాశారు.
ఆర్ఆర్ యాక్టు ప్రయోగిస్తే ఈ మిల్లు యాజమాన్యానికి చెందిన ఆస్తుల క్రయవిక్రయాలు నిలిచిపోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2019-–20 యాసంగి సీజన్‌కు సంబంధించి లింగాల ఘన్‌పూర్‌కు చెందిన కాశీ విశ్వేశ్వర మిల్లు రూ.91,59,226, శార్వాని ఇండస్ట్రీస్ జనగామ రూ.2,91,19,715లు విలువ చేసే సీఎంఆర్ ఇవ్వాల్సి ఉన్నా నేటికీ బకాయిలు చెల్లించడం లేదు. మొత్తంగా జిల్లాలోని నాలుగు మిల్లులు రూ.10 కోట్ల 68లక్షల 34 వేల 550లు పెండింగ్ఉన్నది.
బకాయిల వసూళ్లకు చర్యలు
జనగామ జిల్లాలో నాలుగు రైస్‌మిల్లుల సీఎంఆర్ పెండింగ్ బకాయిలు రూ.10 కోట్ల వరకున్నాయి. 2020 ఏడాది నుంచి రెండు రైస్ మిల్లులు, 2023 వానాకాలం నుంచి మరో రెండు రైస్ మిల్లులు బకాయి పడ్డాయి. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్ ఆదేశాలతో ఆర్ఆర్ యాక్టు ద్వారా వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నం. మిల్లర్లు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటుడడంతో వసూళ్లలో జాప్యం జరుగుతోంది.- హథీరామ్, డీఎం, సివిల్ సప్లై జనగామ
