
- బీఆర్ఎస్ హయాంలో రూ.3 వేల కోట్ల పైనే.. త్వరలో ప్రభుత్వానికి రిపోర్టు
- ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పక్కాగా చేయాలని అధికారుల నిర్ణయం
- రూ.10 కోట్ల టర్నోవర్ దాటిన కంపెనీల ఐటీసీ క్లెయిమ్‌లపై తనిఖీలు
- ఐజీఎస్టీ లావాదేవీలపైనా నిఘా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జీఎస్టీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పేరుతో జరుగుతున్న అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. నకిలీ ఐటీసీల ద్వారా ప్రభుత్వానికి గత ఏడాది కాలంలో దాదాపు రూ.710 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తున్నది. ఇది కేవలం గుర్తించినది మాత్రమే.. ఇంకా అసలు పట్టుబడకుండా జరుగుతున్న అక్రమాల విలువ ఇంతకు డబుల్ట్రిపుల్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్క్రూటినీ మాడ్యూల్‌లో జరిగిన ఐటీసీ అక్రమాలతో దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రతిఏటా యావరేజ్‌గా రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు జీఎస్టీ ఐటీసీ చెల్లింపులు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇందులో చాలా వరకు నకిలీ ఐటీసీలు ఉంటున్నాయి. ఈ దందాను అరికట్టేందుకు జీఎస్టీ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
అక్రమాలను అరికట్టేందుకు చర్యలు..
రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న డీలర్లు 5.5 లక్షల మంది ఉండగా.. వారిలో వార్షిక టర్నోవర్ రూ.కోటిన్నర కంటే ఎక్కువగా ఉండే వ్యాపారులు దాదాపు 2 లక్షలు ఉన్నారు. అందులో కూడా 50 వేల మంది వరకు కేంద్ర జీఎస్టీ పరిధిలో, మిగిలిన దాదాపు లక్షన్నర మంది రాష్ట్ర జీఎస్టీ పరిధిలో ఉన్నారు. మొత్తం జీఎస్టీ రిజిస్ట్రేషన్‌దారులు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలపై, అదే విధంగా ఆయా సంస్థలు తీసుకుంటున్న వే బిల్లులు, నెలవారీగా వేస్తున్న వ్యాపార లావాదేవీల రిటర్న్‌లు సక్రమంగా వేస్తున్నాయా లేదా అన్నదానిపై మానిటరింగ్పెంచాలని అధికారులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
దీంతో అక్రమ ఐటీసీలను నివారించడానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత పటిష్టం చేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తనిఖీ చేసి, అవసరమైతే తనిఖీలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) లావాదేవీలపై నిఘా పెంచనున్నారు. రూ.10 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కంపెనీల ఐటీసీ క్లెయిమ్‌లను నిశితంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఈ కంపెనీలు అనుమానాస్పదంగా భారీ మొత్తంలో ఐటీసీ క్లెయిమ్ చేసినప్పుడు.. దానికి సంబంధించిన వివరాలు, బిల్లులు, లావాదేవీల వాస్తవికతను నిర్ధారించడానికి తనిఖీలు చేపట్టనున్నారు. పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, డేటా అనలిటిక్స్‌ను కూడా వినియోగించేందుకు సిద్ధమయ్యారు. అలాగే జీఎస్టీ ఐటీసీపై స్పెషల్ఆడిట్ చేయనున్నారు.
ఐటీసీ మోసం ఇలా..
వస్తువులు లేదా సేవల కొనుగోలుపై వ్యాపార సంస్థలు చెల్లించే జీఎస్టీని ఐటీసీ అంటారు. ఈ మొత్తాన్ని తుది ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించి కస్టమర్ల నుంచి వసూలు చేసే జీఎస్టీ నుంచి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక కంపెనీ ముడిసరుకు కొనుగోలుపై రూ.1,000 జీఎస్టీ చెల్లిస్తే.. ఆ ముడి సరుకుతో తయారు చేసిన ఉత్పత్తిని విక్రయించినప్పుడు వసూలు చేసే జీఎస్టీలో ఆ రూ.1,000 తగ్గించుకుంటుంది. ఇదే ఐటీసీ మోసానికి ప్రధాన కారణంగా మారుతున్నది. మోసం చేసేవారు నకిలీ కంపెనీలను సృష్టించి, ఎలాంటి వస్తువులు లేదా సేవల సరఫరా లేకుండానే నకిలీ బిల్లులను జారీ చేస్తారు. ఈ నకిలీ బిల్లులను ఉపయోగించి కొన్ని కంపెనీలు వాస్తవంగా చెల్లించని జీఎస్టీని కూడా ఐటీసీగా క్లెయిమ్ చేసుకుంటాయి. ఉదాహరణకు ఒక దుకాణదారుడు రూ.100 విలువైన వస్తువులను కొని, దానిపై రూ.18 జీఎస్టీ చెల్లించాడనుకుందాం. అదే వస్తువును రూ.150కి అమ్మి, దానిపై రూ. 27 జీఎస్టీ వసూలు చేస్తే.. అతను ప్రభుత్వానికి నేరుగా రూ.27 కట్టకుండా, తాను ఇప్పటికే చెల్లించిన రూ.18ని తగ్గించుకుని మిగతా రూ.9 మాత్రమే చెల్లిస్తాడు. ఇదే ఐటీసీ. అయితే ఎలాంటి లావాదేవీలు, వస్తు రవాణా జరపకుండానే నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఐటీసీ పేరుతో ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన మొత్తాన్ని కొట్టేస్తున్నారు.
ఇవీ ఉదాహరణలు..
హైదరాబాద్‌లోని ఒక కంపెనీ ఎలాంటి ముడిసరుకు కొనుగోలు చేయకుండానే సుమారు రూ.25 కోట్ల ఐటీసీ క్లెయిమ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ కంపెనీ భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తేలడంతో డైరెక్టర్లను అరెస్ట్ చేశారు.
వరంగల్‌లోని ఒక నిర్మాణ సంస్థ.. డొల్ల కంపెనీల నుంచి నకిలీ బిల్లులు తీసుకొని, సుమారు రూ.15 కోట్ల ఐటీసీని క్లెయిమ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఆ సంస్థకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను అధికారులు స్తంభింపజేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇటీవల కేశాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థ రూ.100 కోట్లకు పైగా విలువైన నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా రూ.33.2 కోట్ల ఐటీసీని అక్రమంగా క్లెయిమ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ రాగి సరఫరా చేసినట్టు నకిలీ ఇన్‌వాయిస్‌లను జారీ చేసింది. వాస్తవానికి ఎలాంటి వస్తువుల రవాణా లేకుండా ఖాళీ వాహనాలను మహారాష్ట్రకు పంపింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన టోల్ గేట్ రికార్డులు, ఈ-వే బిల్లుల్లోని వివరాల ఆధారంగా అక్రమాలను అధికారులు గుర్తించారు.