మమ్మల్నే అమ్మవార్ల దర్శనానికి వెళ్లనిస్తలే..

మమ్మల్నే అమ్మవార్ల దర్శనానికి వెళ్లనిస్తలే..

మమ్మల్నే అమ్మవార్ల దర్శనానికి వెళ్లనిస్తలే..    గేటు తాళం పగులగొట్టిన పూజారి
మేడారంలో పోలీసులు ఓవర్​యాక్షన్ చేస్తున్నరని ఆరోపణ

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: దేవాదాయ శాఖ అధికారులు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ సోమవారం మేడారం సమ్మక్క దేవాలయం గేటు తాళాలను పూజారులు  పగులగొట్టారు. తమను సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లనీయకుండా గేట్లకు తాళాలు వేయడంపై వారు మండిపడ్డారు. సమ్మక్క గద్దెకు పూజలు నిర్వహించే సిద్దబోయిన  వంశానికి చెందిన సుమారు 20 మంది భక్తులు సోమవారం మేడారానికి వచ్చారు. సమ్మక్క పూజారి సిద్దబోయిన రమేశ్.. వాళ్లను అమ్మవార్ల దర్శనానికి ప్రధాన గేటు నుంచి తీసుకెళ్తుండగా రెండో గేటుకు తాళం వేసి ఉండటం చూసి లాక్ తీయాలని అధికారులను కోరారు. దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు అందుకు నిరాకరించారు.

ఉన్నతాధికారులకు ఫోన్‌‌ చేసినా రెస్పాండ్ కాకపోయేసరికి ఆగ్రహించిన సమ్మక్క పూజారులు పక్కనే ఉన్న రాయి తీసుకొని గేటు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లిపోయారు. గద్దెల వద్ద ఉన్న చిన్న గేట్ల తాళాలను అక్కడి ఇన్​చార్జిలు తీయడంతో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు సమర్పించి బయటికి వచ్చిన తర్వాత పూజారి రమేశ్‌‌ మీడియాతో మాట్లాడారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి మేడారం జాతర జరుపుతున్నామని, సమ్మక్క పూజారులమని,  జిల్లా కలెక్టర్‌‌ నుంచి ఐడెండెటీ కార్డులు కూడా పొందినా ఇక్కడ దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. తమ సంస్కృతి సంప్రదాయాలకు గౌరవం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం..