
- భారత పౌరుల ప్రాణాల కంటేడబ్బే ఎక్కువా?: అసదుద్దీన్ ఓవైసీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ ఏం సమాధానం చెప్తరని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: దేశభక్తి పేరుతో బీజేపీ వ్యాపారం చేస్తోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భారత పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువయిందా అని ప్రశ్నించారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎలా ఆడతారని నిలదీశారు. పాక్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పుడు, నీటి ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పుడు క్రికెట్ మ్యాచ్ మాత్రం ఎందుకు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రక్తం, నీరు కలిసి ప్రవహించ లేవని చెప్పిన ప్రధాని మోదీ.. క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రక్తం, నీరు కలిసి ప్రవహించ లేవని.. టెర్రరిస్టులతో చర్చలుండవని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీసీఐ ఒక్క మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తుంది..? రూ.2 వేల కోట్లా, రూ.3 వేల కోట్లా? మ్యాచ్ విషయంలో పహల్గామ్ బాధితులకు మోదీ ఏం సమాధానం చెప్తారనిప్రశ్నించారు.