
ముషీరాబాద్, వెలుగు: అద్దె బకాయి ఇవ్వకుండా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని ఓనర్ చితకబాదాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాగ్ లింగంపల్లిలోని సాయిబాబా గుడి వద్ద ఉన్న నరేశ్, చోటు సోదరులకు చెందిన ఇంట్లో మహ్మద్ రఫీక్ (33) కొంతకాలంగా అద్దెకు ఉన్నాడు. కొద్ది సమీపంలోనే టీకొట్టుపెట్టుకొని జీవిస్తున్నాడు.
ఓనర్ల సూచనతో ఇంటిని రఫీక్ ఆదివారం ఖాళీ చేసి వెళ్లిపోయాడు. అయితే, అద్దె బకాయి రూ.2 వేలు ఉండడంతో వాటిని ఇవ్వాలని రఫీక్ టీ కొట్టు వద్దకు వెళ్లి నరేశ్, చోటు ఘర్షణకు దిగాడు. బాధితుడు భయపడి పక్కనే ఉన్న పాన్‌షాపులోకి వెళ్లడంతో.. అక్కడి వెళ్లి మరీ నరేశ్ చితకబాదాడు. అడ్డొచ్చిన పాన్‌షాపు ఓనర్ పైనా దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చోటు పరారీలో ఉన్నట్లు తెలిపారు.