గ్రేటర్లో ఫీల్డ్లోకి రాని వెయ్యికిపైగా స్వచ్ఛ ఆటోలు

గ్రేటర్లో  ఫీల్డ్లోకి రాని వెయ్యికిపైగా స్వచ్ఛ ఆటోలు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో చెత్త సేకరణ కోసం జీహెచ్ఎంసీ అందించిన స్వచ్ఛ ఆటోలు మాయమైతున్నాయి. ఓనర్ కమ్ డ్రైవర్ స్కీం కింద జీహెచ్ఎంసీ 4,500 ఆటోలను అందించగా.. వాటిలో దాదాపు వెయ్యి వరకు ఆటోలు ఫీల్డ్ లోకే రావడంలేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాలకు చెత్తను తీసుకెళ్లే స్వచ్ఛ ఆటోలు రాకపోతుండటంతో మూడు, నాలుగు రోజులపాటు ఇండ్లలోనే చెత్త ఉంచుకోవాల్సి వస్తోందని జనం చెబుతున్నారు. స్వచ్ఛ ఆటోకు దాని ఖరీదులో 10 శాతం డ్రైవర్లు చెల్లించగా, మిగతా 90 శాతం ఫైనాన్స్ చేయించి ప్రతినెలా కిస్తీలను జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. ఈ 90 శాతం డ్రైవర్లు చెల్లించాల్సిన అవసరంలేదు. చెత్తను సేకరించేందుకు ఇంటింటికి రూ.50 తీసుకొని ఆటో మెయింటెనెన్స్ తో పాటు డీజిల్ ఖర్చు డ్రైవర్లే చూసుకోవాల్సి ఉంది. అయితే, అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ఆటోలు కనిపించకుండా పోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఉండాల్సిన ఈ ఆటోల్లో కొన్ని శివారు మున్సిపాలిటీల్లో చెత్తను సేకరిస్తుండగా, ఇంకొన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. మరికొందరు సొంత పనులకు వాడుకుంటున్నారు. దీంతో ఇండ్ల వద్ద చెత్తను పెడితే కుక్కలు చెల్లాచెదురు చేస్తున్నాయని జనం అంటున్నారు. రెండు మూడు రోజులు అలాగే పెడుతుండటంతో దుర్వాసన వస్తుందని రోడ్లపైకి తెచ్చి పారేస్తున్నారు. 

ఆటోలు పెరిగినా.. అదే ప్రాబ్లం 

గతేడాది చివరి వరకు 3,250 ఆటోలతోనే సిటీలో చెత్త సేకరణ కొనసాగింది. నిరుడు డిసెంబర్ చివర్లో మరో1,350 ఆటోలను కొత్తగా అందించారు. ఇక నుంచి చెత్త తరలింపులో ఇబ్బందులు ఉండవని పంపిణీ సమయంలో మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ ఆటోల సంఖ్య పెరిగినా.. మళ్లీ అదే సమస్య ఏర్పడింది. చాలా చోట్ల రెండు, మూడు రోజులకు ఓసారి ఆటోలు వస్తున్నాయని జనం చెబుతున్నారు. మొత్తం 4,500 ఆటోలకు బల్దియా ప్రతి నెలా రూ.4 కోట్లకుపైగా ఈఎంఐలను చెల్లిస్తోంది.  ఇంత ఖర్చు అవుతున్నా.. జీహెచ్ఎంసీ పరిధిలో 20 శాతం ఆటోలు ఫీల్డ్ లోకి రావడంలేదు. పండుగల సమయంలో ఫీల్డ్ లోకి రాని ఆటోల సంఖ్య ఇంతకు రెట్టింపుగానే ఉంటోంది. రోజూ దాదాపు వెయ్యికిపైగా ఆటోలు చెత్త సేకరణకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. 

మంత్రి కేటీఆర్ ఆదేశించినా పట్టించుకుంటలె

కొన్నాళ్ల క్రితం జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోను సిద్దిపేటలో గమనించిన మంత్రి కేటీఆర్ దానిపై ఆరా తీశారు. స్వయంగా ఆటో నంబర్ సేకరించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఆటో.. కాప్రా సర్కిల్ కు చెందిన కోటా వెంకటేష్ కు చెందినది గుర్తించారు. ఇలాగే మరి కొందరు కూడా ఇతర అవసరాల కోసం స్వచ్ఛ ఆటోలను వాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఇటీవల చందానగర్ సర్కిల్ లో 10 స్వచ్ఛ ఆటోలు మాయం అయ్యాయని జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బల్దియా ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవల సర్కిల్ అధికారులతో  సమావేశం నిర్వహించారు. ఇకపై ఫీల్డ్ లోకి రాని ఆటోలను స్వాధీనం చేసుకొని వేరే లబ్ధిదారులకు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాకుండా వేరే దగ్గర స్వచ్ఛ ఆటోలు కనిపిస్తే చర్యలు తీసుకోవాలన్నారు.   

చర్యలు తీసుకుంటాం

స్వచ్ఛ ఆటోలను నడపడంలో నిర్లక్ష్యం వహిస్తున్న డ్రైవర్లపై చర్యలు తీసుకుంటాం. చందానగర్ లో మిస్ అయిన ఆటోలను గుర్తించాం. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఫీల్డ్ లోకి రాని ఆటో డ్రైవర్లను చివరి అవకాశంగా హెచ్చరిస్తున్నాం. ఇక నుంచి మంచిగ పనిచేసుకోవాలి. లేకపోతే ఆటోలను తీసుకొని వేరే వారికి అందజేస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా రెగ్యులర్ గా చెత్తను కలెక్ట్​ చేయాలి.    

- సంతోష్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్