స్కూల్ బిల్డింగుల కిరాయిలు కట్టలేక ఫర్నీచర్‌‌‌‌ అమ్ముతున్న యాజమాన్యాలు

స్కూల్ బిల్డింగుల కిరాయిలు కట్టలేక ఫర్నీచర్‌‌‌‌ అమ్ముతున్న యాజమాన్యాలు

చిన్న స్కూళ్లు మూతపడుతున్నయ్​

మెయింటెనెన్స్‌‌‌‌కు తిప్పలు.. స్టాఫ్‌‌‌‌కు జీతాలివ్వలేని దుస్థితి 

బిల్డింగుల కిరాయిలు కట్టలేక ఫర్నీచర్‌‌‌‌ అమ్ముతున్న ఓనర్లు

బస్సుల కిస్తీలకు పైసల్లేక ఫైనాన్స్‌‌‌‌ సంస్థలకే ఇచ్చేస్తున్న పరిస్థితి

బతుకుదెరువుకు చిన్నచిన్న పనులు చేస్తున్న యజమానులు

చిన్న బడులకు పెద్ద కష్టమొచ్చిపడింది. కరోనా వల్ల ఫీజులు వసూలు కాక మెయింటెనెన్స్‌‌ భారమైపోయింది. స్టాఫ్‌‌కు జీతాలు ఇవ్వడానికి కూడా తిప్పలైపోయింది. కిరాయి బిల్డింగుల్లో ఉన్న స్కూళ్ల పరిస్థితైతే ఇంకింత దయనీయంగా మారింది. రెంట్‌‌ కట్టలేక ఫర్నీచర్‌‌ను, కిస్తీలు కట్టలేక బస్సులను ఓనర్లు అమ్మకానికి పెడుతున్నారు. ఇంకొందరు యజమానులు బడులు మూసేసి బతకడానికి చిన్నాచితకా వ్యాపారం చేసుకుంటున్నారు. జాబులు పోయిన టీచింగ్‌‌, నాన్‌‌ టీచింగ్‌‌ సిబ్బంది చాలా మంది రోజుకూలీలుగా మారుతున్నారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం రాక ముందు 14 వేల ప్రైవేటు స్కూళ్లుండేవి. ప్రస్తుతం 10,549 ఉన్నాయి. ఇందులో 90 శాతం నలుగురైదురు నిరుద్యోగులైన పార్ట్‌‌‌‌నర్స్ కలిసి పెట్టిన బడ్జెట్ స్కూళ్లే ఉన్నాయి. వీటిల్లో క్లాస్‌‌‌‌ను బట్టి ఏడాదికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేలు తీసుకుంటున్నారు. ఒక్కో స్టూడెంట్‌‌‌‌కు ఏడాదికి రూ. లక్ష నుంచి రూ. 4 లక్షలు వసూలు చేసే కార్పొరేట్ స్కూళ్లు వెయ్యి వరకు ఉన్నాయి. బడ్జెట్‌‌‌‌ స్కూళ్లలో సుమారు 1.50 లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పని చేస్తున్నారు. అయితే కరోనా వల్ల గత అకడమిక్ ఇయర్‌‌‌‌లో ఎగ్జామ్స్ పెట్టకముదే  మార్చిలో స్కూళ్లను మూసేశారు. ఆ తర్వాత స్టూడెంట్లను పైతరగతులకు సర్కారు ప్రమోట్ చేసింది. మళ్లీ సెప్టెంబర్ 1 నుంచి అధికారికంగా స్కూళ్లలో ఆన్‌‌‌‌లైన్​ క్లాసులు ప్రారంభించినా బడ్జెట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లు క్లాసులకు పూర్తి స్థాయిలో హాజరవట్లేదు. హాజరైన  కొందరిలోనూ సగం మంది ఫీజులు కట్టక మెయింటెనెన్స్‌‌‌‌ భారంగా మారింది.

బేరానికి బస్సులు, ఫర్నీచర్‌‌‌‌

బడ్జెట్ స్కూళ్లలో చివరి ఎగ్జామ్స్ టైమ్‌‌‌‌లోనే లాస్ట్ టర్మ్ ఫీజు, పెండింగ్ ఫీజులు ఎక్కువగా వసూలవుతుంటాయి. తీరా పరీక్షలకు ముందే లాక్ డౌన్ పెట్టి స్కూళ్లు మూసేయడంతో మేనేజ్‌‌మెంట్లకు 30 శాతం నుంచి 40 శాతం ఫీజులు రాకుండాపోయాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్ల యజమానులు బాగా నష్టపోయారు. ఆ కష్టాలే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల ప్రైవేట్ స్కూళ్లు ఇప్పటికిప్పుడు మూసే పరిస్థితిలో ఉన్నట్లు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేత రామేశ్వర్‌‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎంఐ పద్ధతిలో కొన్న బస్సులకు కిస్తీలు కట్టలేకపోతుండటంతో ఫైనాన్స్ సంస్థలు బస్సులు లాక్కెళ్తున్నాయి. మరికొందరు బస్సులు మెయింటెయిన్ చేయలేక అమ్మకానికి పెడుతున్నారు. స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారో కరెక్టుగా తెలియక ఇంకొందరు స్కూళ్లు, ఫర్నిచర్‌‌ను బేరం పెడుతున్నారు. ఇలాంటి స్కూళ్లను కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ యాజమాన్యాలు కొనేసి రాత్రికిరాత్రి పేర్లు మార్చేస్తున్నాయి.

రాష్ట్రం వచ్చాక 2 వేల స్కూళ్ల బంద్‌‌

రాష్ట్రం ఏర్పాటుకు ముందు మనదగ్గర 14 వేల స్కూళ్లుండేవి. ఏర్పాటయ్యాక సుమారు 2 వేల స్కూళ్ల వరకు మూతబడ్డాయి. కరోనా వైరస్​ ఎఫెక్ట్​తో ఇప్పుడు మరో రెండు, మూడు వేల స్కూళ్లు మూతపడే పరిస్థితి. లాక్‌‌డౌన్ తర్వాత ఫీజు అడిగితే 100 నంబర్‌‌కు ఫోన్ చేయండని ప్రభుత్వమే చెప్పడంతో తల్లిదండ్రులెవరూ ఫీజు కట్టలేదు. ఆన్‌‌లైన్ క్లాసులు స్టార్టయ్యాకనైనా ఫీజులు కట్టాలని పేరెంట్స్‌‌కు ప్రభుత్వం మెసేజ్‌‌ ఇచ్చుంటే బాగుండేది. కానీ పట్టించుకోవట్లేదు.

– నెమరుగొమ్ముల రామేశ్వర్‌‌రావు, కన్వీనర్, వరంగల్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్​

కార్పొరేట్​పై నియంత్రణేది?

సర్కారు ఫెయిల్యూర్​ వల్లే విద్యను కార్పొరేట్ స్కూల్ మేనేజ్‌‌మెంట్స్ వ్యాపారంగా మార్చి స్టూడెంట్స్‌‌ను కస్టమర్లుగా చూస్తున్నాయి. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లపై నియంత్రణ, పర్యవేక్షణ లేకుండా పోయింది. రీజనబుల్ ఫీజుతో చదువు చెప్పే ప్రైవేట్ స్కూళ్లు చాలా మందికి ఆల్టర్నేటివ్‌‌గా నిలిచాయి. కానీ కరోనా వల్ల ఈ స్కూళ్లన్నీ మూతపడే పరిస్థితి. బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేసిన ఓ మహిళ కరోనాతో టీచర్ జాబ్‌‌ పోయి హైదరాబాద్‌‌లో ఓ ఇంట్లో వంట పనికి చేరింది. ఇది చాలా దురదృష్టకరం.

– ఆర్వీ చంద్రవదన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

కార్పొరేట్‌‌ కుట్రను అర్థం చేస్కోవాలె

వరంగల్‌‌లో ఆంధ్రా కార్పొరేట్ స్కూల్ నారాయణ విద్యాసంస్థల వాళ్లు అడ్మిషన్లు స్టార్ట్‌‌ చేశారు. ఫీజు స్ట్రక్చర్ తక్కువ చూపి బడ్జెట్ స్కూల్స్ స్టూడెంట్లను చేర్చుకుంటున్నరు. చుట్టుపక్కల స్కూళ్లు మూతపడ్డాక ఫీజులు పెంచుతారు. ఈ కుట్రను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

– మాదాల సతీశ్‌‌కుమార్, ట్రస్మా రాష్ట్ర కమిటీ సభ్యుడు

For More News..

ఆస్తుల మ్యుటేషన్ బంద్.. అయోమయంలో కొనుగోలుదారులు

అక్టోబర్ 31 వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవద్దు

కల్యాణ లక్ష్మి చెక్కులు ఇయ్యరు.. లోన్లు అడిగితే ఇచ్చే దిక్కు లేదు..