కరోనా వచ్చిందా..మీ సావు మీరు సావున్రి

కరోనా వచ్చిందా..మీ సావు మీరు సావున్రి
  • పాజిటివ్​ వచ్చిన సింగరేణి కార్మికులను వదిలేస్తున్న యాజమాన్యం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :ఇల్లెందు ఏరియాకు చెందిన ఓ కార్మికుడు చెస్ట్​ పెయిన్​తో కొత్తగూడెం మెయిన్​ హాస్పిటల్​లో పది రోజుల కింద జాయిన్​ అయ్యాడు. పరీక్షల అనంతరం మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్​ హాస్పిటల్​కు రిఫర్​ చేశారు. హార్ట్​ ప్రాబ్లం ఉందని పరీక్షలు నిర్వహించారు. సర్జరీ చేయాలని రెండు, మూడు రోజులు అక్కడే ఉంచుకున్నారు. చివరికి నీకు కరోనా పాజిటివ్​వచ్చింది.. ఇక్కడి నుంచి వెళ్లు.. అంటూ బలవంతంగా గెంటేశారు. ఆ పేషెంట్​కు ఎటు పోవాలో అర్థం కాలేదు. ఆయన ఫ్యామిలీమెంబర్స్​ సింగరేణి మెడికల్​ ఆఫీసర్లను సంప్రదిస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో హార్ట్​ ప్రాబ్లమ్​ ఉన్న కార్మికుడు కార్పొరేట్​ హాస్పిటల్​లో ఉండలేక, ఇంటికి వెళ్లలేక రెండు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో జాయిన్​ అయ్యాడు. ఇటీవల మణుగూరు, భూపాలపల్లి నుంచి కార్పొరేట్​ హాస్పిటళ్లకు రెఫర్​చేసిన మరో ఇద్దరు కార్మికులనూ అక్కడి నుంచి గెంటేస్తే గాంధీలోనే ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ పొందుతున్నారు. కనీసం తాము రిఫర్​ చేసిన పేషెంట్లు ఏమయ్యారో, ఎక్కడ, ఎలాఉన్నారో తెలుసుకునేందుకు కూడా సింగరేణి ఆఫీసర్లు ప్రయత్నించలేదు. వారి నుంచి ఫోన్లు కూడా రాలేదని పేషెంట్ల కుటుంబసభ్యులు అంటున్నారు.

సింగరేణిలో విస్తరిస్తున్న కరోనా

సింగరేణి కాలరీస్​లో కరోనా నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని యాజమాన్యం, ఆఫీసర్లు చెబుతున్నా పాజిటివ్​కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, శ్రీరాంపూర్​, మందమర్రి, బెల్లంపల్లి, అడ్రియాల, రామగుండం ఏరియాల్లో సింగరేణి గనులు విస్తరించాయి. దాదాపు54వేల మంది రెగ్యులర్​,20వేల మంది కాంట్రాక్ట్​ కార్మికులు డ్యూటీలు చేస్తున్నారు. అధికారికంగా సింగరేణి పరిధిలో ఇప్పటి వరకు 14 కేసులు నమోదైనట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈక్రమంలో దాదాపు 500 మందిని హోం క్వారంటైన్, ఐసోలేషన్​లో ఉంచారు. ప్రారంభంలో భూపాలపల్లి, శ్రీరాంపూర్​, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లోనే కనిపించిన కరోనా ప్రస్తుతం కొత్తగూడెం, మణుగూరు ఏరియాలకు విస్తరించింది. హెడ్డాఫీసులోనూ ఒకరికి కరోనా సింప్టమ్స్​ కనిపించడంతో హోం క్వారంటైన్​ చేశారు.

కార్మికుల్లో టెన్షన్​..

సింగరేణి రెగ్యులర్​ కార్మికుల్లో సుమారు 35వేల మంది 40 ఏళ్లు దాటిన వారేఉన్నారు. ముఖ్యంగా 50 ఏండ్లు దాటిన వారు పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందుతుండడంతో కార్మికులతో పాటు వారి కుటుంబాల్లోనూ ఆందోళన నెలకొంది. తాజాగా కేసులు పెరుగుతుండడంతో కోల్​బెల్ట్​ కాలనీల్లోనూ టెన్షన్​ వాతావరణం కనిపిస్తోంది. కాలనీల వారీగా సోడియం హైపో క్లోరైడ్​ లిక్విడ్​స్ప్రే చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నా యాజమాన్యం నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. కానీ మైన్స్​, డిపార్ట్​మెంట్ల వద్ద మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​ హాస్పిటల్​తో పాటు భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్​ ఏరియాలో ఐసోలేషన్​ వార్డులను సిద్ధంచేశారు.

రెఫరల్​ పేషెంట్లకు కష్టాలు..

కంపెనీలో పనిచేస్తూ 50 ఏండ్లు దాటిన కార్మికుల్లో ఎక్కువ మంది హార్ట్​, కిడ్నీ , చెస్ట్​ పెయిన్​, టీబీ, లివర్, గ్యాస్​ ట్రబుల్​​లాంటి పలు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడ్తున్నారు. వీరు ఆయా సమస్యలపై సింగరేణి ఏరియా హాస్పిటల్​కు వెళ్తే అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​ హాస్పిటల్​కు పంపిస్తారు. ఇక్కడ కూడా నయం కాకపోతే హైదరాబాద్​లోని కార్పొరేట్​​హాస్పిటల్స్ కు రిఫర్​ చేస్తుంటారు. ఇలాంటివాటిలో సర్జరీ అవసరమయ్యే సీరియస్ ​పేషెంట్లే ఎక్కువ ఉంటారు. ప్రతి ఏడాది కార్పొరేట్​ హాస్పిటల్స్​ కు వందల కేసులు వెళ్తాయి. ఇలా వెళ్లే పేషెంట్లకు అయ్యే ఖర్చులను యాజమాన్యమే భరిస్తుంది. కానీ ఇటీవల ఇలా హైదరాబాద్​ లోని కార్పొరేట్​ హాస్పిటల్​కు వెళ్తున్న కార్మిక పేషెంట్లకు కరోనా సోకుతోంది. పాజిటివ్​ అని తెలియగానే కార్పొరేట్​ ఆసుపత్రుల నుంచి గెంటేసినంత పని చేస్తున్నారు. వారికి ఎలాంటి ట్రీట్​మెంట్​ అందించకుండా ఇళ్లకు వెళ్లగొడ్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా సింగరేణి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఎవరైనా గట్టిగా అడిగితే గాంధీకి వెళ్లుమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. అంతే గానీ తాము రిఫరల్​ చేసిన కేసు కదా అనే కనికరం కూడా చూపడం లేదని కార్మికులు, వారి ఫ్యామిలీ మెంబర్లు అంటున్నారు. కార్పొరేట్​ హాస్పిటల్స్​లో కరోనా ట్రీట్​మెంట్​కు ప్రభుత్వమే అనుమతి ఇచ్చినందున తమకు యాజమాన్యమే చికిత్స చేయించాలని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

బీహార్ లో ఒకేరోజు 107 మంది ప్రాణాలు తీసిన పిడుగులు