గ్రేటర్‌లో ప్రమాదకర స్థాయికి ఎయిర్​ క్వాలిటీ

గ్రేటర్‌లో ప్రమాదకర స్థాయికి ఎయిర్​ క్వాలిటీ

హైదరాబాద్, వెలుగు: సిటీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరి వాతావరణంలో ప్రాణవాయువు పడిపోతోంది. సిటీ ఎయిర్​క్వాలిటీ ఇండెక్స్​అన్​హెల్దీ కండీషన్ ను చూపిస్తోంది. సాధారణంగా ఉండే ఎయిర్, కన్​స్ట్రక్షన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్​కు పొగమంచు కూడా తోడవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. ఇలాంటి వాతావరణం జనాల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న వారికి మరింత ప్రమాదకరమని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు, షుగర్, బీపీ లాంటివి ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి వాతావరణం కారణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి సైతం కొత్త జబ్బులు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

మూడు రెట్లు ఎక్కువగా పొల్యూషన్..  

మరో వైపు వెహికల్ పొల్యూషన్​తో ఎయిర్ క్వాలిటీ అధ్వానంగా మారుతోంది. ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. 50 నుంచి100 మధ్యలో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సిటీలోని అనేక  ఏరియాల్లో 100 నుంచి 150 మధ్య ఉండి అన్ హెల్దీ ఎయిర్ క్వాలిటీని చూపిస్తోంది. డబ్ల్యూహెచ్‌‌వో సూచించిన ఎయిర్ క్వాలిటీ పీఎం2.5 (కాలుష్య కారకాలు) ప్రమాణాల కంటే సిటీలో 3.1రెట్లు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సైట్‌‌ లో పేర్కొంది. సిటీలోని జీడిమెట్ల, నాచారం, ఉప్పల్, పాశమైలారం, మల్లాపూర్, గడ్డిపోచారం, కుత్బుల్లాపూర్, చర్లపల్లి, గాజులరామారం, కూకట్​పల్లి, బాచుపల్లి, పటాన్‌‌ చెరు వంటి పలు ప్రాంతాల్లో ఫార్మసీకి చెందిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు, కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే కెమికల్స్ ​కారణంగా ఈ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది.

ఫ్యాక్టరీల గ్యాస్ .. పొగమంచు  

ఫ్యాక్టరీల నుంచి వెలువడే గ్యాస్, పొగమంచు కలిసి ఏర్పడే స్మాగ్, దీంతో పాటు వెహికల్స్ నుంచి వచ్చే పొగ కారణంగా చాలామంది ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల బారిన పడుతున్నారని డాక్టర్లు చెప్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. వీటితో పాటు తీవ్రమైన తలనొప్పి, సైనస్, కంటి సమస్యలు, వీక్ నెస్ వంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని బాధితులు చెప్తున్నారు. చలికాలం కావడంతో చర్మ సంబంధిత వ్యాధులైన అలర్జీ, వాంతులు వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయితే బయటకు రాలేకపోతున్నామని.. కిటికీలు, తలుపులు మూసుకొని ఉంటున్నా సమస్య నుంచి తప్పించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. 

వెహికల్స్ ఎక్కువవుతుండటంతో .. 

వెహికల్స్ సంఖ్య పెరగడమే పొల్యూషన్​కు ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు. సిటీలో కోటికి పైగా జనాభా ఉండగా..  కరోనా కంటే ముందు 60 లక్షల వెహికల్స్ ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 75 లక్షలకు చేరింది. వీటిలో 70 శాతం వరకు టూవీలర్స్ ఉండగా, 10 శాతం కార్లు ఉంటాయని, మిగతావి ఆటోలు ఇతరత్రా వెహికల్స్ అని ట్రాన్స్‌‌పోర్ట్ అధికారులు చెప్తున్నారు. ప్రతి ఏడాది బైక్​ల రిజిస్ట్రేషన్లు 15 శాతం, కార్ల రిజిస్ట్రేషన్లు 10 శాతం పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ వెహికల్స్ నుంచి వెలువడే పొగతో గాలిలో కాలుష్య తీవ్రత పెరిగిపోతోంది.రెసిడెన్షియల్ ఏరియాల్లో చెత్తను తగులపెట్టొద్దు. ఇండస్ట్రియల్ ఏరియాలో వెహికల్స్, పరిశ్రమల నుంచి వెలువడే కెమికల్ గ్యాస్ వల్ల అక్కడి జనం అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరోవైపు జీహెచ్‌‌ఎంసీ సిబ్బందే రెసిడెన్షియల్ ఏరియాల్లో చెత్తను కాలుస్తున్నారు. దీనివల్ల కూడా పొల్యూషన్ ఏర్పడుతోంది. ప్రభుత్వం వీటిని దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలి. పాత వెహికల్స్​కారణంగా రెట్టింపు పొల్యూషన్ ​అవుతోంది. పాత వెహికల్స్ ను తీసేయాలని 2003లో సుప్రీంకోర్లు చెప్పినప్పటికీ అది ఇంప్లిమెంట్ కావడం లేదు.

– జీవానందరెడ్డి, పర్యావరణవేత్త

కేసులు పెరుగుతున్నయ్..

వాతావరణంలో మార్పులు, పొగమంచు, ఇండస్ట్రీల నుంచి వెలువడే పొగ, వెహికల్ పొల్యూషన్ కలిసిపోయి కెమికల్ ఫామ్​లాగా మారుతుంది. వీటిని పీల్చుకోవడం వల్ల జనాలు లంగ్స్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్స్, ముక్కు కారడం, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే అనారోగ్య సమస్యలున్నవారికి అవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్​లు, చలిని తట్టుకునేందుకు స్వెటర్లు తప్పనిసరిగా వాడాలి. 

–డా.రఫీ, పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్

యూనిఫైడ్ ట్రాఫిక్ మొబిలిటీ అవసరం

సిటీలో గతంతో పోలిస్తే వెహికల్స్ నుంచి వెలువడుతున్న పొల్యూషన్ విపరీతంగా పెరిగింది. అయినా సంబంధిత విభాగాల నుంచి సరైన పర్యవేక్షణ లేదు. ఎయిర్ పొల్యూషన్ మిటిగేటర్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో వాడే నానోమీటర్ వల్ల అది కార్బన్ మోనాక్సైడ్ ని తీసుకుంటూ పీఎం2.5ని తీసుకుని ఎయిర్​ను క్లీన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. వెహికల్​ పొల్యూషన్ తగ్గించాలంటే యూనిఫైడ్ ట్రాఫిక్ మొబిలిటీ మేనేజ్​మెంట్ అవసరం. 

- ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు, జేఎన్టీయూ