
హనుమకొండ/కమలాపూర్, వెలుగు: ‘యమధర్మరాజు వద్ద చిత్రగుప్తుడు లెక్కలు రాసినట్టే.. కాళేశ్వరం అకౌంట్లు మొత్తం తీస్తున్నం. రోడ్లు, కాంట్రాక్టుల మీద కమీషన్లు ఎక్కడెక్కడ తింటున్నవో.. ఏ ప్రభుత్వ ఉద్యోగి ఏం చేస్తున్నడో.. ఏ పోలీసోళ్లు ఏమేం చేస్తున్నరో మొత్తం అకౌంట్లు రాస్తున్నం. రెండు సంవత్సరాల తరువాత వారివారి అకౌంట్ల లెక్కల ప్రకారం అవినీతికి పాల్పడిన వారందరినీ బయటకు పంపించడమే బీజేపీ పని’ అని ఆ పార్టీ జాతీయ నాయకుడు, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి పి.మురళీధర్‌రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం కన్నూరులో మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎసోళ్లు పైసలతోటి గెలుస్తమనుకుంటున్నరు. పైసలతో గెలిచేదుంటే దుబ్బాకలో ఎందుకు గెలువలే. ఎన్టీఆర్, ఇందిరాగాంధీనే ఓడించినం. పైసలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించింది ప్రజలే. దుబ్బాకలో ఏం జరిగిందో.. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా అదే జరుగుతది. హుజూరాబాద్‌లో గెలిచి తీరుతం. ఆ తరువాత అందరి అంతు చూస్తం అని స్పష్టం చేశారు. 30న ఎన్నికలు పూర్తయిన తరువాత టీఆర్ఎస్ పునాదులు కదులుతాయని, అనంతరం రెండేండ్లు కౌంట్ డౌన్స్టార్ట్అయితదని, ఆ కుటుంబం కూడా కదులుతుందని చెప్పారు. టీఆర్ఎస్ లో ఉన్న దొంగలంతా బయటపడతారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్న ఈటల రాజేందర్ రాముడు చెప్తే లక్ష్మణుడు చేసినట్టుగా అన్నీ చేశాడన్నారు. అలాంటి ఈటలను కేసీఆర్ నమ్మించి గొంతు కోశాడని మండిపడ్డారు. కేసీఆర్ తన కొడుకును సీఎం చేయాలనుకునే కుట్రలో భాగంగానే ఈటలను బయటకు పంపించాడన్నారు. ఈటలను ఎందుకు మోసం చేశాడో హుజురాబాద్ ప్రజలు ప్రశ్నించాలన్నారు. కుటుంబం, వారసత్వం కోసం చేసిన రాజకీయ హత్యగా అభివర్ణించారు. దానికి వ్యతిరేకంగా హుజురాబాద్ ప్రజలే తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లీడర్లు మహా మాయజాలం చేస్తారని, ఓట్లు మాయం చేసే పార్టీ టీఆర్ఎస్ అన్నారు. అందుకే ఉదయం మొదటి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్లు మళ్లీ టీఆర్ఎస్ లోకే వెళతారని, కాంగ్రెస్కోవర్టుల పార్టీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్, కుంటా సత్యవతి, కట్కూరి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.