
భైంసా, వెలుగు: బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశానని ఆదివారం ప్రకటించారు. ముథోల్ బీజేపీ టికెట్‌ను రామారావు పటేల్‌కు ఖరారు చేయడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. నిర్మల్ బీజేపీ టికెట్ మొదటి నుంచీ తనకే వస్తుందని ఆమె ధీమాతో ఉన్నారు. అయితే, అధిష్ఠానం ఆమెను పక్కన పెట్టి రామారావు పటేల్‌కు టికెట్టును ఖరారు చేయడంతో రమాదేవి కన్నీటి పరయ్యాంతమయ్యారు.
ఈ పరిణామాన్ని జీర్ణించుకొలేక ఆదివారం రాత్రి 10 గంటలకు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బులు ఇచ్చిన వారికే అధిష్ఠానం టికెట్టు కేటాయించిందని ఆరోపించారు. బీజేపీ తనకు టికెట్టు ఇవ్వకున్నా తాను ముథోల్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను తన కుటుంబానికి దూరమై పార్టీ కోసం ఏండ్లుగా పనిచేస్తున్నానని, జిల్లా అధ్యక్షురాలిగా పార్టీని అభివృద్ధి చేసేందుకు ఎంతో శ్రమించానని చెప్పారు. కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి పార్టీని జిల్లా అంతటా విస్తరింపజేశానని పేర్కొన్నారు. తల్లిదండ్రులా నమ్ముకున్న పార్టీ తనను అన్యాయం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాంతంతో పనిచేసే పార్టీని నమ్ముకున్నానని, ఆ పార్టీ తనకు బొంద పెట్టిందని వాపోయారు.
బీఆర్ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిజైన్
ఖమ్మం టౌన్, వెలుగు : బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేకపోవడంతో బీఆర్ఎస్ వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని సురేశ్ గౌడ్ తెలిపారు. ఖమ్మం సిటీలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థి నాయకునిగా కేసులపాలై చంచల్ గూడ జైలుకు వెళ్లానని, తనపై 70 కేసులు నమోదయ్యాయని తెలిపారు. జిల్లాలో ఉద్యమకారులను, విద్యార్థి నాయకులను పార్టీ కోసం వాడుకుని, అవసరం తీరాక పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో కొంత మంది వ్యక్తుల నియంతృత్వ పోకడలు పార్టీకి ప్రమాదకరంగా మారాయన్నారు. కొంతమంది రెడీమేడ్ గా వచ్చి పదవులు పొంది పార్టీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఉద్యమకారులను విస్మరించడం ఆవేదనకు గురిచేసిందన్నారు.