
చిన్నప్పుడు స్కూలుకెళ్లి చదవలేదు. అప్పుడెప్పుడో రాత్రి బడికెళ్లి అరకొర అక్షరాలు నేర్చుకున్నాడు. అయితేనేం అలవోకగా కవితలు, పాటలు అల్లేస్తాడు. జీవనం కోసం చెప్పులు కుడుతూనే.. మరో పక్క సాహిత్యం వైపు అడుగులు వేస్తున్నాడు. అందరూ ‘బడికెళ్లని జానపద కవి’ అని పిలుస్తారు ఈయనని. పేరు.. యాదయ్య, ఊరు.. ఫణిగిరి. మరిన్ని వివరాలు చదవండి.
రాంపాక ఈదయ్యది సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఫణిగిరి. రాంపాక బక్కయ్య-, ఈరమ్మ దంపతుల రెండో కొడుకు ఈదయ్య. పదహారేళ్ల వయసులో నరసమ్మతో పెళ్లి జరిగింది. వాళ్లకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. బతుకు బండి గుంజడానికి చెప్పులు కుడుతూనే కవితలు రాస్తున్నాడు. బడికెళ్లని జానపద కవిగా ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది. ఈదయ్యను పల్లె ప్రజలు ముద్దుగా ‘పంతులు’ అని పిలుస్తుంటారు. చిన్నతనంలో తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు పడ్డాడు.
అడపాదడపా రాత్రి బడికి వెళ్లి నేర్చుకున్న కొద్దిపాటి చదువుతోనే 29 భాగవత కథలు, 200 పైగా పాటలు రాశాడు. 64 గ్రామాల్లో కళా బృందాలు ఏర్పాటు చేసి 1400 పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.
ఇట్లా పెరిగిండు
రోడ్ల మీద పారేసిన తెల్లకాగితాలు తెచ్చుకొని పక్కవారితో అక్షరాలు పెట్టించుకుని దిద్దుకున్నాడు ఈదయ్య. ఎక్కడ వీధి నాటకాలు వేసినా అక్కడికి వెళ్లేవాడు. వాళ్లు పాడుతున్న పాటలు, మాటలు శ్రద్ధగా విని నేర్చుకునేవాడు. తక్కువ టైంలోనే వాటిపై పట్టు సాధించాడు. తర్వాత రాయడం మొదలుపెట్టాడు. మొదట యక్షగానాలు, బుర్ర కథలు రాశాడు. ఆయనకు చిన్నప్పట్నుంచి నాటకాలు బుర్రకథలు, పాటలపై మక్కువ ఎక్కువ. ఎన్టీఆర్ నటించిన ‘వేంకటేశ్వర మహత్యం’ సినిమా చూసి ‘వేంకటేశ్వరలీలలు’ అనే యక్షగానాన్ని ఆయనే రాసి ప్రదర్శించాడు. తర్వాత ‘బేతాళ విజయం, రావణాసుర, గర్వభంగం, ఖండ అనంతుల వధ, ఆది జాంబవ, అరుంధతి, శ్రీశైల మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర, నల్లమల్ల, పెద్దిరాజు, రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర, యేసయ్య, చిరుతల భజన, ఎల్లమ్మ బుర్రకథలు, అబ్రహం డ్రామా, అంబేద్కర్ బుర్రకథ, పెనుగంచిప్రోలు, తిరుపతమ్మ కథలు, చెంచాల ప్రతిజ్ఞ, రూప విలాసం, రతీమన్మథ విలాసం, మేడారం సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్ర’.. రాశాడు. వాటిని కళాకారులతో ప్రదర్శించేవాడు. ఆయన రాసిన చాలా పుస్తకాలు అచ్చు వేయడానికి డబ్బు లేని పరిస్థితి. ఈదయ్య రచయితగానే కాకుండా, నటుడిగా భాగవత కథల్లో పాత్రలు పోషించి మెప్పిస్తాడు. ముఖ్యంగా రాముడు, ఆంజనేయుడు, వాల్మీకి వేషాలతో ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో
174 గ్రామాల్లో 1400పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు తగ్గట్టు లీనమై ప్రేక్షకులను మైమరపిస్తాడు.
కళనే నమ్ముకున్నా
కళను నమ్ముకుని బతుకుతున్నా. ప్రభుత్వం పేద కళాకారులను ప్రోత్సహించాలి. నాకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రోత్సాహం అందలేదు. ఎన్నో పుస్తకాలు రాశాను. వాటిని భద్రపరచడానికి బీరువా కూడా లేదు. ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే పింఛను ఇప్పిస్తే బాగుంటుంది.
– ఈదయ్య
మరిన్ని వార్తలు
మెట్రో అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
విజయ్ దేవరకొండ ఆర్థిక సహాయం: గోల్డ్ మెడల్ కొట్టిన కిక్ బాక్సర్