లేని వడ్లకు రికార్డులు సృష్టించి కోటి కొట్టేసిన్రు

లేని వడ్లకు రికార్డులు సృష్టించి కోటి కొట్టేసిన్రు
  • మిల్లర్లతో కలిసి పీఏసీఎస్ చైర్మన్​ నిర్వాకం 
  • ప్రైవేట్​గా కొన్న ధాన్యాన్నిసొసైటీ పేరుతో విక్రయం
  • సొసైటీ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి..

ఖమ్మం రూరల్ మండలం మంగళగూడానికి చెందిన బోజడ్ల వెంకటయ్యకు సొంత ఊర్లో మామిడి తోట ఉంది. ఆ భూమిని ఖమ్మం సిటీకి చెందిన పోట్ల మోహన్ రావు కౌలుకు తీసుకొని 810 బస్తాల ధాన్యాన్ని పండించి అమ్మినట్టు సొసైటీలో ట్రక్ షీట్ తయారు చేశారు. అయితే అంతకు ముందు వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేసిన పంటల ప్రణాళిక రికార్డుల్లో మాత్రం ఆ భూమిలో మామిడి తోట ఉందని, వరి పొలం లేదని నివేదించారు. అదే గ్రామానికి చెందిన కిలారు లక్ష్మయ్య భూమిలో సుబాబుల్, పామాయిల్ సాగు చేస్తుండగా, 830 క్వింటాళ్ల ధాన్యం పండినట్టు రికార్డులు సృష్టించారు.

ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు:  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అవినీతిలో కొత్త కోణం ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. లేని ధాన్యాన్ని సొసైటీ ద్వారా కొన్నట్టు తప్పుడు రికార్డులు సృష్టించి, ట్రక్ షీట్లు క్రియేట్ చేసి దాదాపు రూ.కోటి వరకు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైస్​మిల్లర్లు బయట రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న ధాన్యాన్ని, సొసైటీలో రైతుల నుంచి 
నిబంధనలకు విరుద్ధంగా కిలోల కొద్దీ తీసిన తరుగును మేనేజ్​ చేసేందుకే ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏకంగా రైస్ మిల్లర్లతో కలిసి, అధికార పార్టీకి చెందిన సొసైటీ చైర్మన్ ఈ దందాకు పాల్పడినట్టు సొసైటీ డైరెక్టర్లు ఖమ్మం జిల్లా సహకార శాఖ అధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఖమ్మం జిల్లాకు చెందిన రెండు రైస్ మిల్లులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక రైస్ మిల్లు యజమానులతో కలిసి అక్రమాలకు పాల్పడిన సొసైటీ చైర్మన్​నుంచి డబ్బులు రికవరీ చేయాలని డైరెక్టర్లు కోరడం జిల్లాలో సంచలనంగా మారింది. 

ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎండాకాలం 8 చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మొత్తం 1450 మంది రైతుల నుంచి రూ.11.2 కోట్ల విలువైన 59,274 క్వింటాళ్ల ధాన్యం కొన్నారు. అయితే ఈ కొనుగోళ్లపై సొసైటీ డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా, చైర్మన్​ ఏనుగు ధర్మారెడ్డి సొసైటీ రికార్డులను స్వాధీనం చేసుకొని అక్రమాలకు పాల్పడ్డారని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. సొసైటీలో తాత్కాలిక ఉద్యోగులు ఇద్దరిని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇన్​చార్జిలుగా నియమించి సొసైటీ చైర్మనే సొంతంగా వ్యాపారాన్ని నడిపించినట్టు చెబుతున్నారు. సొంతంగా రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని మిల్లర్లకు పంపించి, సొసైటీ ట్రక్ షీట్లలో మూడు రైస్ మిల్లర్ల యజమానుల పేర్లు, వారి సమీప బంధువులు, ఇతర నమ్మకమైన వ్యక్తుల పేర్లు రాశారు. దీంతో వారి ఖాతాల్లో పడిన డబ్బులను మిల్లర్లతో కలిసి సొసైటీ చైర్మన్​ పంచుకున్నట్టు డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. పాలకమండలి సమావేశాలను ఏర్పాటు చేయకపోవడం, రికార్డులను చూపించకపోవడంతో డైరెక్టర్లు సొసైటీ చైర్మన్​పై ఒత్తిడి చేశారు. పలు వాయిదాల తర్వాత ఈ నెల ఒకటో తేదీన సొసైటీ మీటింగ్ ను ఏర్పాటు చేసి అనారోగ్యం కారణంగా చూపుతూ చైర్మన్​ ఏనుగు ధర్మారెడ్డి మీటింగ్ కు హాజరుకాలేదు. దీంతో తర్వాతి రోజు సొసైటీ వైస్​ చైర్మన్​ ఆధ్వర్యంలో సమావేశమై ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా జరిగిన అవినీతిని డైరెక్టర్లు గుర్తించారు. దీనిపై గురువారం ఖమ్మం రూరల్ పోలీసులకు, జిల్లా సహకార శాఖ అధికారికి, జిల్లా కలెక్టర్ కు కంప్లయింట్ చేశారు. భద్రాచలానికి చెందిన కంచర్ల జనార్దన్ రావు రైస్ మిల్ జనరల్ మర్చంట్, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఎస్.వి.రైస్ ఇండస్ట్రీస్, ఓం శ్రీ లక్ష్మి రైస్ మిల్ కు కలిపి మొత్తం రూ.1,00,43,404 విలువైన 13,299 బస్తాల ధాన్యానికి ట్రక్ షీట్లు తయారుచేసి సొసైటీ నుంచి ధాన్యం పంపినట్టు రికార్డులు తయారు చేశారు. ట్రక్ షీట్లలో కౌలు రైతులు సాగు చేసినట్టుగా చూపించిన భూమిలో అసలు ఈ ఏ కాలంలోనూ ధాన్యం పండలేదని, అందులో మామిడి, సుబాబుల్ తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారుల రికార్డుల్లో ఉండడం అక్రమాలను నిర్ధారిస్తోందని సొసైటీ డైరెక్టర్లు అంటున్నారు.

మిల్లర్లతో చైర్మన్ కుమ్మక్కయ్యారు

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లతో సొసైటీ చైర్మన్ కుమ్మక్కయ్యారు. అసలు ధాన్యం కొనకుండానే ట్రక్ షీట్లు తయారుచేసి ధాన్యం కొన్నట్టు రికార్డుల్లో చూపించారు. ధాన్యం కొనుగోళ్ల మీద చర్చించేందుకు సొసైటీ సమావేశాలను పెట్టాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా చైర్మన్ ధర్మారెడ్డి తప్పించుకుంటూ వచ్చారు. అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.   – యండపల్లి రవి, సొసైటీ డైరెక్టర్, ఏదులాపురంశాఖాపరమైన విచారణకు ఆదేశించాం. ఏదులాపురం సొసైటీ వ్యవహారంపై డైరెక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వయిరీకి అదేశించాం. అసిస్టెంట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సహకార చట్టం సెక్షన్ 51 ప్రకారం ఎంక్వయిరీ చేస్తున్నారు. డీసీసీబీ సీఈఓ నుంచి కూడా కంప్లయింట్ వచ్చింది. ఎంక్వయిరీ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సొసైటీలో నిధుల అవకతవకలకు సంబంధించి సీఈఓను సస్పెండ్ చేశాం.
– విజయకుమారి, జిల్లా సహకార అధికారి