
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), జిల్లా సహకార బ్యాంకులు (డీసీసీబీలు), రాష్ట్ర సహకార బ్యాంకుల (టీజీకాబ్) నిర్వహణ కమిటీల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం ఈ మేరకు వ్యవసాయ, సహకార ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.రఘునందన్ రావు ఉత్వర్వులు జారీ చేశారు.
రాష్ట్ర సహకార సంఘాల చట్టం 1964లోని సెక్షన్ 32(7) (ఏ) ప్రకారం, ప్రస్తుతం ఉన్న -ఇన్-చార్జ్ కమిటీలను మళ్లీ ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కొనసాగించాలని సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త రెవెన్యూ మండలాలు, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్యాక్స్, డీసీసీబీల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
2024 ఫిబ్రవరి 14న జారీ చేసిన ఉత్తర్వుల్లో గతంలో ఈ కమిటీలను ఆరు నెలల పాటు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే గత జులై 30న సహకార శాఖ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ కమిటీల కొనసాగింపును మరికొంత కాలం పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. సహకార సంఘాల నిర్వహణలో అసమర్థత, అనర్హత, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే కమిటీల స్థానంలో సెక్షన్ 32(7) (ఏ) ప్రకారం కొత్త వ్యక్తులను నియమించే అధికారాన్ని రిజిస్ట్రార్‌కు ప్రభుత్వం అప్పగించింది.
నియమిత వ్యక్తులు చట్టం, నిబంధనలు, ప్రకారం సహకార సంఘాల ప్రయోజనాలకు అనుగుణంగా విధులను నిర్వర్తించాలని ఆదేశించింది.ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని సహకార శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం సూచించింది.