వడ్లు, మొక్కజొన్న కొనుగోళ్ల ఆలస్యంపై రైతు కన్నెర్ర... అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన

వడ్లు, మొక్కజొన్న కొనుగోళ్ల ఆలస్యంపై రైతు కన్నెర్ర... అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన
  • వడ్లు, మక్కలు కొనాలని రోడ్డెక్కిన అన్నదాతలు
  • పలు మండలాల్లో రాస్తారోకోలు, ధర్నాలు

వడ్లు, మొక్కజొన్న కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతులు కన్నెర్ర చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పలుచోట్ల ప్రధాన రహదారులపై బైఠాయించి రాస్తారోకోలు చేశారు. కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలని నినాదాలు  చేశారు. వీరి ఆందోళనలతో రహదారులపై భారీగా ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళనలు విరమించారు. 

వెలుగు నెట్​వర్క్: ఇరవై రోజులు గడిచినా ధాన్యాన్ని తూకం వేయడం లేదని ఆరోపిస్తూ కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై గంగాధర మండలం వెంకటాయపల్లి స్టేజీ సమీపంలో రైతులు గురువారం రాస్తారోకో చేశారు. ధాన్యం కొనడం లేదని, తూకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. బస్తాకు 41 కిలోలకు బదులు 42 కిలోల 200 గ్రాముల వరకు తూకం వేస్తున్నారని వాపోయారు. ఇప్పటివరకు రెండు లారీల వడ్లను మాత్రమే రైస్ మిల్లులకు తరలించారని తెలిపారు. అక్కడికి చేరుకున్న తర్వాత కూడా బస్తాకు కిలో చొప్పున సుమారు 700 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు పేర్కొన్నారు.

వర్ధన్నపేటలో : ధాన్యం కొనడం లేదని ఆగ్రహించిన రైతులు గురువారం వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై బైఠాయించారు. కలెక్టర్ కాంటాలు చేయాలని చెప్పినా స్థానిక మార్కెట్ చైర్మన్ వెంకటయ్య అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైతులను బెదిరింపులకు గురిచేస్తూ రాజకీయ పక్షపాతం చూపుతున్నారని అన్నారు.

భగ్గుమన్న మక్క రైతులు..

మక్కజొన్నలు కొనాలని డిమాండ్ చేస్తూ గురువారం నర్సంపేట–నెక్కొండ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. వారం రోజులుగా మక్కలు కొనడం లేదని మండిపడ్డారు. కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.

మొక్కజొన్నలకు నిప్పు..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో హమాలీల బకాయిలు చెల్లించకపోవడంతో ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. దీంతో కొనుగోళ్లు ఆగిపోయాయి. ఆగ్రహించిన రైతులు రోడ్డుపై మక్కజొన్నలు పోసి నిప్పంటించి రాస్తారోకో చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మార్కెట్ యార్డ్ వద్ద మక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు.

కాల్మొక్తా.. వడ్లు కొనుర్రి..

మంచిర్యాల: వడ్లు కొనాలంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట ఐకేపీ కేంద్రం వద్ద రైతులు గురువారం ఆందోళన చేశారు. అక్కడికి డీఆర్డీవో కిషన్​, హాజీపూర్ తహసీల్దార్ పుష్పలత చేరుకున్నారు. నంనూర్ గ్రామానికి చెందిన రైతు బుదారపు మల్లేశ్ వారి కాళ్లపై పడ్డాడు. వడ్లు వెంటనే కాంటా వేయాలని వేడుకున్నాడు.