
మెదక్ (కౌడిపల్లి), వెలుగు:మెదక్ జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమైనా.. అధికారులు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం లేదు. దీంతో రైతులు వడ్లను తీసుకొచ్చిసెంటర్లు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో కప్పులుగా పోసి పడిగాపులు గాస్తున్నారు. కొన్ని చోట్ల హైవేలు, విలేజ్ రోడ్లపై ఆరబోస్తున్నారు. కాగా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే కోతలు చేపట్టిన రైతులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నిరుడు లేట్ చేయడంతో చెడగొట్టు వానలకు చాలావరకు వడ్లు తడిసిపోయాయని, ఈ సారి అలా జరగకుండా చూడాలని కోరుతున్నారు. అధికారులు, నిర్వాహకులు మాత్రం ఇంకా ఆర్డర్స్ రాలేదని చెబుతున్నారు.
420 సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన్రు..
యాసంగి సీజన్ లో మెదక్ జిల్లాలో 1,98,258 ఎకరాల్లో వరి సాగు కాగా 4.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్, ఏఎంసీల ఆధ్వర్యంలో 402 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కలెక్టర్రాజర్షిషా సివిల్ సప్లై, డీఆర్డీఏ, కో ఆపరేటివ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టి ఈ నెల మూడోవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. అయినా అధికారులు సెంటర్లు ఓపెన్ చేయలేదు. వరి కోతలు షురూ కావడంతో సెంటర్ల వద్దకు పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కౌడిపల్లి, కొల్చారం, మెదక్, పాపన్నపేట మండలాల పరిధిలో రైతులు ధాన్యాన్ని సెంటర్ల వద్దకు తెచ్చి కుప్పలు పోశారు. ప్లేసు లేని ప్రాంతాల్లో రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. మరో వారం రోజుల్లో అన్ని మండలాల్లో వరి నూర్పిళ్లు ముమ్మరం కానుండడంతో సెంటర్లను వడ్లు ముంచెత్తే అకాశం ఉంది.
అన్ని సమకూరితేనే సజావుగా ప్రక్రియ
కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, కాంటాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ట్యాబ్‌లు సరిపడినన్ని సమకూరితేనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఏ ఒక్కటి తక్కువైనా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా సెంటర్లు వెంటనే ఓపెన్ చేయకుంటే రైతులు ధాన్యం కుప్పలతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల టార్పాలిన్ల కిరాయి ఖర్చు పెరిగిపోతుందని, అకాల వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరి కోసి ఆరు రోజులాయే
నేను వరి పంటకోసి ఆరు రోజులాయే. వడ్లు తెచ్చి సెంటర్ పెట్టే దగ్గర కుప్పలు పోసిన. ఇంకా సెంటర్ స్టార్ట్ చేయలే. ఎప్పుడు చేస్తరో ఏమో తెలుస్తలేదు. సెంటర్ ఓనెన్ చేసే దాకా వడ్ల కుప్పల కావాలి ఉండుడు తక్లీబే. జల్ది సెంటర్ తెరిచి వడ్లు కాంటా పెడితే నయముండు.
- గాండ్ల శ్రీనివాస్, రైతు, రాజిపేట్
ఇంకా ఆర్డర్స్ రాలే
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మీటింగ్ పెట్టినా.. ప్రారంభానికి సంబంధించి ఇంకా ఆర్డర్స్ రాలేదు. పోయిన సీజన్‌లో కొనుగోలు కేంద్రాలకు ఇచ్చిన ట్యాబ్ లు సరిగా పనిచేయక ధాన్యం కాంటా అయిన రైతుల వివరాల ఎంట్రీ లేట్అయ్యింది. దీంతో ఈ సారి స్పీడ్‌గా పనిచేసే కొత్త ట్యాబ్‌లు కొనాలని చెబుతున్నరు. సామగ్రి రెడీ చేసుకుని ఈనెల 27 నుంచి సెంటర్లు ప్రారంభించే అవకాశం ఉంది.
- పీఏసీఎస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మహ్మద్‌నగర్